: హిందూ పిల్లలకు స్కూళ్లలో రామాయణం, గీత నేర్పించాలి... అప్పుడే మహిళలపై దాడులు తగ్గుతాయి: శ్రీ స్వరూపానంద స్వామి
హిందూ పిల్లలకు స్కూళ్లలో రామాయణం, గీత నేర్పించాలని, అప్పుడే మహిళలపై దాడులు తగ్గుతాయని ద్వారకా పీఠాధిపతి స్వరూపానంద అన్నారు. పాకిస్థాన్ నుంచి భారత్కు రవాణా అవుతున్న డ్రగ్స్ వల్ల కూడా ఇక్కడి యువత పాడవుతున్నారని అన్నారు. భారతదేశంలో జరుగుతున్న గోవధలు పూర్తిగా ఆగిపోవాలనే లక్ష్యంతో తాము పనిచేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయితే గోహత్యలు ఇక ఉండబోవని తాము అనుకున్నట్లు చెప్పారు. అయినప్పటికీ ఆగకపోవడం శోచనీయమని పేర్కొన్నారు. అయోధ్యలో రామమందిరం నిర్మించాలని ఆయన డిమాండ్ చేశారు. అయోధ్యలో రామమందిరాన్ని నిర్మించేది సాధువులేనని అన్నారు. దేశంలోని ఎన్నో రాష్ట్రాల్లో రిజర్వేషన్ల కోసం ఎన్నో పోరాటాలు చేస్తున్నారని, ఏ వర్గానికీ రిజర్వేషన్లు ఉండకూడదని ఆయన అన్నారు. కులం, వర్గం ఆధారంగా ఉండే రిజర్వేషన్లు రద్దు చేయాలని అన్నారు. అనంతపురంలో ఇటీవల ద్వారకా పీఠాధిపతి స్వరూపానంద సభలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. స్వరూపానంద షిర్డీ సాయినాథుడిపై మరోసారి ఆ రోజు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో సాయి భక్తులు ఆయనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లా ఒంగోలులో ఆయన ప్రెస్మీట్ ఏర్పాటు చేసి తనపై వస్తోన్న విమర్శలను తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. సాయి భక్తులు ఆందోళన చేసే బదులు తమతో చర్చకు రావాలని అన్నారు.