: ‘మిషన్ చెబుత్రా’... అర్ధరాత్రి హైదరాబాద్‌లో అల్లర్లు చేస్తోన్న 220 మంది మైనర్లకు పోలీసుల కౌన్సెలింగ్
హైదరాబాద్‌లోని పాతబస్తీ పరిసర ప్రాంతాల్లో ఆకతాయిల్లా తిరుగుతూ పట్టుబడిన మైనర్లకు పోలీసులు ఈ రోజు కౌన్సెలింగ్ ఇచ్చారు. తల్లిదండ్రుల సమక్షంలో 220 మంది మైనర్లకు ఈ కౌన్సెలింగ్ ఇచ్చామని దక్షిణ మండల డీసీపీ సత్యనారాయణ తెలిపారు. వీరంతా బైక్ రేసింగ్‌లు, అర్ధరాత్రి అల్లర్లు చేస్తూ పట్టుబడిన మైనర్లుగా ఆయన పేర్కొన్నారు. రెండోసారి పట్టుబడితే మైనర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు. మైనర్ల తల్లిదండ్రులపై మోటారు వాహనాల చట్టం కింద కేసులు నమోదవుతాయని చెప్పారు. అర్ధరాత్రి రోడ్లపై ఇష్టం వచ్చినట్లు తిరుగుతూ అల్లరి చేస్తోన్న మైనర్లను ‘మిషన్ చెబుత్రా’ పేరుతో తాము అదుపులోకి తీసుకుంటున్నట్లు డీసీపీ మైనర్ల తల్లిదండ్రులకు తెలిపారు.