: మరి కాసేపట్లో హైదరాబాద్‌కు జగ్గయ్యపేట యువకుడి గుండె, కాలేయం.. గ్రీన్ చానల్ ద్వారా తరలింపు
అనారోగ్యం కారణంగా అచేతనుడైన యువకుడికి పునర్జన్మ ప్రసాదించేందుకు ఓ నిరుపేద కుటుంబం ముందుకొచ్చింది. విజయవాడలోని ఆంధ్ర ఆస్పత్రిలో జీవన్మృతుడిగా ఉన్న 29 ఏళ్ల గంగుల వంశీకృష్ణ తిరిగి మామూలు అయ్యే పరిస్థితి లేదని తెలుసుకున్న కుటుంబ సభ్యులు అతడి అవయవాలను దానం చేయడం ద్వారా మరికొందరికి పునర్జన్మ ప్రసాదించాలని నిర్ణయించారు. జగ్గయ్యపేటకు చెందిన వంశీకృష్ణ ఓ ప్రైవేటు కళాశాలలో కంప్యూటర్ ఫాకల్టీగా పనిచేస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం తీవ్ర తలనొప్పి, జర్వంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. చికిత్స అనంతరం ఆరోగ్యం కొంత మెరుగుపడినప్పటికీ మూడు రోజుల క్రితం మళ్లీ విషమించడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. చికిత్సకు ఆయన శరీరం స్పందించడం లేదని గుర్తించిన వైద్యులు విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులకు తెలిపారు. విషయం తెలిసిన వారు కన్నీటి పర్యంతమయ్యారు. తీవ్ర దుఃఖంలోనూ వంశీకృష్ణ అవయవాలను జీవనదానం చేసేందుకు ముందుకొచ్చారు. వారి నిర్ణయాన్ని స్వాగతించిన వైద్యులు అవయవ మార్పిడికి ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లోని రెండు ఆస్పత్రుల్లో ఉన్న బాధితుల కోసం గుండె, కాలేయాన్ని తరలించే ఏర్పాట్లు చేశారు. ఆస్పత్రి నుంచి గన్నవరం విమానాశ్రయం వరకు అవయవాల తరలింపునకు గ్రీన్ చానల్ ఏర్పాటు చేశారు. పోలీసుల సహకారంతో గుండె, కాలేయాన్ని తరలిస్తున్నారు. ప్రత్యేక విమానంలో గన్నవరం నుంచి హైదరాబాద్‌కు అవయవాలు తరలిస్తారు. వంశీకృష్ణ మూత్రపిండాలు, కళ్లను విజయవాడలోని ముగ్గురు రోగులకు అమర్చనున్నారు.