: రాబోయే ఎన్నికల్లో పోటీ చేయను: జేసీ దివాకర్ రెడ్డి
అనంతపురం ఎంపీ, టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తాను పోటీ చేయనని ఆయన ప్రకటించారు. ఈరోజు అనంతపురంలో పర్యావరణం-పారిశుద్ధ్య శంఖారావం అనే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన జేసీ ప్రసంగిస్తూ... పార్లమెంటు, అసెంబ్లీల్లో చర్చ సందర్భంగా చేతులెత్తడం తప్ప ప్రజాప్రతినిధులు చేస్తున్నదేమీ లేదని వ్యంగ్యంగా అన్నారు. అందుకే తాను ఇకపై ఏ స్థానానికీ పోటీ చేయనని తెలిపారు. పాకిస్థాన్ కుట్రలకు ముగింపు పలకాలంటే, ఆ దేశంపై యుద్ధం చేయడమొక్కటే పరిష్కారమని జేసీ అభిప్రాయపడ్డారు. యుద్ధంలో 20 కోట్ల నుంచి 30 కోట్ల మంది ప్రజలు చనిపోయినా సరే... పాక్ కు మాత్రం బుద్ధి చెప్పాల్సిందే అని అన్నారు. గాంధీ, నెహ్రూలిద్దరూ గొప్ప నేతలని... కానీ, జిన్నాతో కలసి దేశ విభజనకు వారు కారణమయ్యారని... అప్పటి నుంచి పాకిస్థాన్ మనకు పెద్ద సమస్యగా మారిందని అభిప్రాయపడ్డారు.