: మీడియా సామ్రాజ్యంలోకి ట్రంప్... రంగంలోకి దిగిన అల్లుడు!
మీడియా సామ్రాజ్యంలోకి ప్రవేశించాలని భావిస్తున్న డొనాల్డ్ ట్రంప్, ఆ పనుల పర్యవేక్షణ బాధ్యతలను అల్లుడు జేర్డ్ కుష్ నర్ కు అప్పగించినట్టు తెలుస్తోంది. ట్రంప్ కుమార్తె ఇవాంకా భర్త అయిన కుష్ నర్ ఇప్పటికే అమెరికాలో టాప్ డీల్ మేకర్లలో ఒకటైన లయన్ ట్రీ అడ్వర్టయిజర్స్ చీఫ్ అర్యే బుర్కాఫ్ ను కలిసి టీవీ నెట్ వర్క్ ను ఏర్పాటు చేసే విషయమై చర్చించినట్టు తెలుస్తోంది. ఈ చర్చలు తొలి దశలోనే ఉన్నాయని, అధ్యక్ష ఎన్నికలు ముగిసిన అనంతరం కీలక దశకు చేరుకోవచ్చని సమాచారం. కాగా, గత నెలలో వాషింగ్టన్ పోస్ట్ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో, మీడియా కంపెనీ ప్రారంభించాలన్న ఆసక్తి తనకు లేదని ట్రంప్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన అల్లుడు టీవీ నెట్ వర్క్ ఏర్పాటు చేస్తున్నట్టు వార్తలు రావడం గమనార్హం.