: పాకిస్థాన్ ఉగ్రవాద చర్యలను సహించబోము: రాజ్‌నాథ్ సింగ్
ఉగ్రవాదంపై పోరాటం విషయంలో పాక్‌కు చిత్తశుద్ధి లేనట్లు తెలుస్తోందని హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ఛండీగఢ్లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఈ రోజు ఆయన మాట్లాడుతూ.. ఉగ్రవాదమే తమ దేశ విధానంగా పాక్ వ్యవహరిస్తోందని అన్నారు. ఉగ్రవాదులకు వ్యతిరేకంగా పాక్ పోరాడితే అందుకు భారత్ సాయం చేస్తుందని చెప్పారు. చైనాతో భారత్‌కు పలు అంశాల్లో విభేదాలున్నప్పటికీ ఆ దేశంతో సంబంధాలు బలంగానే ఉన్నాయని చెప్పారు. సరిహద్దు అతిక్రమణ అంశంలో చైనాతో ఉన్న వివాదం తగ్గిందని ఆయన పేర్కొన్నారు. ఉగ్రవాదులను ప్రోత్సహిస్తోన్న పాకిస్థాన్ చర్యలను భారత్ సహించబోదని చెప్పారు. ఉగ్రవాదులను పాకిస్థాన్ స్వాతంత్ర్య సమరయోధుల్లా కీర్తిస్తోందని అన్నారు. ఉగ్రవాదుల చొరబాట్లను నివారించేందుకు సరిహద్దును 2018 డిసెంబర్ లోపు మూసివేస్తామని మరోసారి చెప్పారు. తీరప్రాంతాల సరిహద్దుల్లో ఉగ్రవాదులు చొరబడకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. భారత ఆర్థిక వ్యవస్థ మెరుగ్గా ఉందని, ఇదే విధంగా కొనసాగితే ప్రపంచంలోనే భారత్ మూడో స్థానంలో నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.