: ప్రముఖ తెలుగు ఛానెల్‌పై మండిపడుతున్న జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు!
తెలుగు సినీహీరో జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'జనతా గ్యారేజ్' గత నెల 1వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలై మంచి వసూళ్లు సాధించిన విషయం తెలిసిందే. అయితే ఓ తెలుగు టీవీ ఛానెల్ ఈ నెల 23న ఈ మూవీని టెలికాస్ట్ చేయనున్నట్లు తెలిపింది. దీనిపై ఎన్టీఆర్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్విట్టర్లో సదరు ఛానెల్‌పై మండిపడుతున్నారు. అభిమాన హీరో సినిమా వస్తే సాధారణంగా ప్రేక్షకులు సంతోషాన్ని వ్యక్తం చేస్తారు. అయితే, జనతా గ్యారేజ్ టెలికాస్ట్ పట్ల అభిమానుల ఆగ్రహానికి కారణం లేకపోలేదు. ఈ సినిమా తారక్ సినిమాలన్నింటిలోకెల్లా బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. రూ. 100 కోట్ల క్లబ్‌లోనూ చేరింది. ఈ మూవీని థియేటర్లలో వందరోజులు ఆడేలా చేయాలని ఎన్టీఆర్ అభిమానులు ప్లాన్ చేస్తున్నారు. మరో రెండు రోజుల్లో ఈ మూవీ 50 రోజులు పూర్తి చేసుకోనుంది. ఈ సందర్భంగా పండుగను చేసుకోవాలని అభిమానులు భావిస్తున్నారు. ఇంతలో వచ్చే ఆదివారం నాడు బుల్లితెరపై ఈ సినిమా రానుండడంతో వారు అప్సెట్ అయ్యారు. బుల్లితెరలో మూవీ వచ్చేస్తే ఇక సినిమా హాల్‌కి అభిమానులు ఎలా వస్తారని ఆందోళన చెందుతున్నారు. దీంతో సోషల్ మీడియాలో ఆ ఛానెల్ పై విమర్శలు చేస్తున్నారు. ఇంత త్వరగా జనతా గ్యారేజ్ టీవీల్లో రావాలనుకోవడం లేదని ఒక అభిమాని పోస్టు చేస్తే, ఈ సినిమా టెలికాస్ట్‌ను ఆపేయాలంటూ మరో అభిమాని సోషల్ మీడియాతో డిమాండ్ చేశాడు. ఫ్యాన్స్ మనోభావాలతో ఆడుకోకూడదు అంటూ ఓ అభిమాని పోస్ట్ చేశాడు. మరో అభిమాని మండిపడుతూ ‘ఇంత కక్కుర్తి ఎందుకు? ఇక తరువాత ఎన్టీఆర్ మూవీ షూటింగ్లో ఉండగానే లైవ్ టెలికాస్ట్ చేసేస్తారా?’ అంటూ ప్రశ్నించాడు. ఇలా రకరకాల ట్వీట్లు చేస్తున్నారు.