: నిరంకుశ పద్ధతుల వల్లే తెలంగాణలో ఆందోళనలు కొనసాగుతున్నాయి: ప్రొ.కోదండరాం
తెలంగాణ ఐకాస ఛైర్మన్ కోదండరాం ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి రాజీవ్‌శర్మను కలిసిన విషయం తెలిసిందే. జిల్లాల పునర్వ్యవస్థీకరణపై జరుగుతున్న ఆందోళనపై సీఎస్‌తో చర్చించిన తరువాత ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో నిరంకుశ పద్ధతుల వల్లే ఆందోళనలు ఇంకా కొనసాగుతున్నాయని కోదండరాం విమర్శించారు. ఉద్యమం నుంచి వచ్చిన తెలంగాణ సర్కారుపై ప్రజల సంక్షేమం విషయంలో ఎంతో బాధ్యత ఉందని అన్నారు. ఇటీవల చేసిన జిల్లాలు, మండలాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు సంతృప్తికరంగా లేదని ఆయన విమర్శించారు. ఇప్పటికీ వాటిపై ఆందోళనలు కొనసాగుతున్నాయని చెప్పారు. నిరసన వ్యక్తం చేస్తోన్న వారితో సర్కారు చర్చలు జరపాలని ఆయన సూచించారు. ప్రజలు ముఖ్యమంత్రిని కలిసి తమ సమస్యలు విన్నవించుకునే అవకాశం ఉండాలని ఆయన వ్యాఖ్యానించారు.