: అంతర్జాతీయ కబడ్డీకి గుడ్ బై చెప్పనున్న కెప్టెన్ అనూప్
స్టార్ కబడ్డీ ప్లేయర్, భారత జట్టు కెప్టెన్ అనూప్ కుమార్ అంతర్జాతీయ కబడ్డీకి గుడ్ బై చెప్పనున్నాడు. ఈ వరల్డ్ కప్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటిస్తానని తెలిపాడు. అయితే, ప్రొ కబడ్డీ లీగ్ లో మాత్రం కొనసాగుతానని చెప్పాడు. భారత్ టీమ్ లోకి యువ ఆటగాళ్లు రావాలనేదే తన కోరిక అని... అందుకే తాను రిటైర్ అవుతున్నానని తెలిపాడు. ఈ వరల్డ్ కప్ ను భారత్ గెలవాలనేది తన కల అని అనూప్ చెప్పాడు. హర్యాణా రాష్ట్రంలో డిప్యూటీ పోలీస్ కమిషనర్ గా పనిచేస్తున్న అనూప్... ఆ రాష్ట్రంలోని గుర్గావ్ జిల్లాలోని పాల్రా అనే చిన్న గ్రామం నుంచి వచ్చాడు. అంచెలంచెలుగా ఎదుగుతూ కబడ్డీలో తన ప్రస్థానాన్ని కొనసాగించాడు. 2006లో జరిగిన దక్షిణాసియా గేమ్స్ తో జాతీయ కబడ్డీ జట్టులోకి అడుగుపెట్టాడు. 2012లో అర్జున అవార్డును అందుకున్నాడు. 2016లో భారత కబడ్డీ టీమ్ కు కెప్టెన్ గా ఎంపికయ్యాడు. ప్రొ కబడ్డీలో 'యు ముంబ' జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు.