: కివీస్ ఆటగాళ్లలో స్వదేశం వెళ్లిపోవాలన్న తొందర కనిపిస్తోంది: గంగూలీ
న్యూజిలాండ్ జట్టు ఆటతీరుపై టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తొలి వన్డేపై ఆయన మాట్లాడుతూ, కివీస్ ఆటతీరును టెస్టు సిరీస్ నుంచీ గమనిస్తున్నానని, ఆటగాళ్లలో చాలా మార్పువచ్చిందని అన్నారు. స్టీఫెన్ ఫ్లెమింగ్, బ్రెండన్ మెక్ కల్లమ్ జట్టు నుంచి వీడ్కోలు తీసుకున్న అనంతరం కివీస్ ఆటగాళ్లు పోరాడడం మర్చిపోయినట్టున్నారని అన్నారు. ఆటగాళ్లలో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోందని ఆయన తెలిపారు. సిరీస్ ముగించి ఎప్పుడు స్వదేశానికి వెళ్లిపోదామా? అన్న ఆలోచనలో న్యూజిలాండ్ ఆటగాళ్లు ఉన్నట్టు కనిపిస్తోందని ఆయన అన్నారు. మ్యాచ్ ఆడేందుకు దిగిన తరువాత ఆశల్ని వదిలేస్తున్నారని ఆయన చెప్పారు. కనీసం టెయిలెండర్ టిమ్ సౌతీ చూపించిన పోరాటపటిమను కూడా ఆ జట్టు ప్రధాన ఆటగాళ్లు చూపించలేదని ఆయన విమర్శించారు. ఈ విషయం విలియమ్సన్, రాస్ టేలర్ అవుటైన విధానం చూస్తే అర్థమవుతుందని ఆయన తెలిపారు.