: ప్రతి శుక్రవారం కోర్టులో 33 సార్లు జగన్ పేరు పిలుస్తున్నారు: టీడీపీ నేత సీఎం రమేష్
అవినీతిపై వైఎస్సార్సీపీ అధినేత జగన్ మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించడంలా ఉందని టీడీపీ ఎంపీ సీఎం రమేష్ తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, జగన్ కు సంబంధించిన వేల కోట్ల రూపాయలను ఈడీ అటాచ్ చేసిందని అన్నారు. హైదరాబాదు నుంచి ఒక వ్యక్తి పదివేల కోట్ల రూపాయల నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకున్నారనగానే అందరూ గతంలో ఇలాంటి నేరాలు చేసిన వారివైపు చూస్తారని అన్నారు. ప్రతి శుక్రవారం కోర్టులో జగన్ పేరును 33 సార్లు పిలుస్తారని ఆయన తెలిపారు. అలాంటి వ్యక్తి అవినీతిపై ప్రధానికి లేఖ రాయడం హాస్యాస్పదమని ఆయన అభిప్రాయపడ్డారు. అయినా అవినీతి పరులను పట్టివ్వమని కోరడం మంచిదేనని ఆయన తెలిపారు. అయితే గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకోవద్దని ఆయన హితవు పలికారు. దేశ ప్రజలందరికీ ఎవరు అవినీతితో ఆస్తులు సంపాదించారో తెలుసని ఆయన తెలిపారు.