: టీవీ సీరియల్ స్ఫూర్తితో కిడ్నాప్... కటకటాల్లోకి ప్రేమ జంట!
హిందీ టీవీలో ప్రసారమయ్య 'క్రైం పెట్రోల్' కార్యక్రమాన్ని చూసి స్పూర్తి పొందిన రాజస్థాన్ కు చెందిన ప్రేమ జంట కటకటాల వెనక్కి వెళ్లిన ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... జోధ్ పూర్ కు చెందిన పూర్ణిషా, ఆమె ప్రియుడు మయానక్ మెహతా కలిసి జీవించాలనుకున్నారు. అలా జీవించేందుకు అవసరమైన డబ్బును వ్యాపారవేత్త అయిన పూర్ణిషా బాబాయ్ కొడుకు యుగ్ బండారిని కిడ్నాప్ చేయడం ద్వారా సంపాదించాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా ప్రియుడితో కలిసి ప్లాన్ చేసిన పూర్ణిషా... తమ్ముడు యుగ్ ను కిడ్నాప్ చేసింది. ఆ తరువాత యుగ్ ను విడిచిపెట్టాలంటే 50 లక్షల రూపాయలు ఇవ్వాలని పూర్ణిషా బాబాయ్ రితేష్ కు ఫోన్ లో డిమాండ్ చేయించింది. యుగ్ కు ఎక్కడ నష్టం చేస్తారోనని భయపడ్డ రితేష్ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేసి, సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ఛేదించారు. కేవలం నాలుగు గంటల్లోనే ఈ కిడ్నాప్ కేసు కొలిక్కి రావడం విశేషం. తాము ఓ టీవీ సీరియల్ ను చూసి స్పూర్తి పొంది ఈ కిడ్నాప్ చేశామని, అందులో బెదిరించగానే డబ్బులు తెచ్చి ఇస్తారని, అలాగే ఇక్కడ కూడా జరుగుతుందని భావించామని ఈ ప్రేమ జంట పేర్కొనడం విశేషం.