: గోవా డిక్లరేషన్ లో జైషే మొహమ్మద్, లష్కరే తోయిబా పేర్లు చేర్చేందుకు ససేమిరా అన్న చైనా
బ్రిక్స్ సమావేశాలు ముగిసిన వేళ, వెలువరించే సంయుక్త తీర్మానంలో పాక్ కేంద్రంగా ఉగ్రదాడులకు పాల్పడుతున్న జైషే మొహమ్మద్, లష్కరే తోయిబా పేర్లను తీర్మానంలో చేర్చేందుకు చైనా ససేమిరా అంది. అంతర్జాతీయ ఉగ్రవాదాన్ని నిలువరించేందుకు అన్ని దేశాలూ పరస్పర సహకారాన్ని అందించుకోవాలని మాత్రమే ఈ డిక్లరేషన్ లో చేర్చారు. ఉగ్రసంస్థల పేర్లను చేర్చాలని భారత్ చేసిన ప్రయత్నాలను చైనా అడ్డుకుందని తెలుస్తోంది. సీమాంతర ఉగ్రవాదాన్ని సాధ్యమైనంతగా ప్రపంచ దేశాల ముందుకు తీసుకు వెళ్లేందుకు బ్రిక్స్ సమావేశాలను ప్రధాని నరేంద్ర మోదీ వినియోగించుకోగా, తమతో స్నేహంగా ఉన్న పాక్ కు ఇబ్బంది కలుగుతుందన్న ఉద్దేశంతోనే, జైషే మొహమ్మద్, లష్కరే తోయిబా పేర్లను చేర్చేందుకు చైనా అంగీకరించలేదని సమాచారం. ఈ రెండు సంస్థలూ సీమాంతర ఉగ్రవాదానికి ఇస్తున్న మద్దతుపై బ్రిక్స్ సభ్య దేశాల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడంతో వాటి పేర్లు చేర్చలేదని విదేశాంగ శాఖ కార్యదర్శి అమర్ సిన్హా వెల్లడించారు. "పాక్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రసంస్థలు భారత్ పైనే దృష్టిని సారించాయి. ఇతర బ్రిక్స్ దేశాలు ఈ విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేదు. దాని ప్రభావం ఇండియాపై పడుతోంది. డిక్లరేషన్ లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులను, జబాత్ అల్ నుస్రాను చేర్చారు. పాక్ సంస్థల పేర్లు పెట్టకపోవడం నిరుత్సాహాన్ని కలిగించింది" అని అమర్ సిన్హా వ్యాఖ్యానించారు. ఈ విషయంలో భారత్ సైతం గట్టిగా ఒత్తిడి చేయాలని భావించలేదని, బ్రిక్స్ సమావేశాల్లో ఎన్నో కీలకాంశాలున్నాయని, వాటన్నింటిపైన అర్థవంతమైన చర్చలు జరిగాయని, భవిష్యత్తులో వాటి ఫలాలను అందుకోవడంపైనే దృష్టిని సారిస్తామని ఆయన అన్నారు. కాగా, ఈ డిక్లరేషన్ లో యూరీ దాడిని సైతం ప్రస్తావించలేదు. ఇదే సమయంలో ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దాన్ని అడ్డుకోవాల్సిందేనని, అందుకు బ్రిక్స్ దేశాలు ముందడుగు వేస్తాయని ప్రకటించారు. గతంలో జరిగిన బ్రిక్స్ దేశాల సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలను ప్రస్తావిస్తూ, ఐదు దేశాల మధ్యా మరింత ద్వైపాక్షిక బంధానికి కృషి చేసేందుకు దృఢ నిశ్చయంతో ఉన్నట్టు పేర్కొంది.