: బోయపాటికి గర్వం నెత్తికెక్కి నా గురించి అవాకులు చవాకులు మాట్లాడుతున్నాడు!: పోసాని కృష్ణమురళి
తనకు మెంటల్ ఉంటే సినీ పరిశ్రమ తనను ఎందుకు ఆదరిస్తుందని ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణమురళి ప్రశ్నించారు. తన వద్ద 35 మంది వరకు అసిస్టెంట్లుగా పని చేసేవారని, వారంతా ఇప్పుడు మంచి పొజిషన్ లో ఉన్నారని సంతోషం వ్యక్తం చేశారు. కేవలం బోయపాటి శ్రీను తప్ప మిగిలిన వారంతా తనపట్ల కృతజ్ఞతగా ఉన్నారని ఆయన తెలిపారు. తిండికి గతిలేని పరిస్థితుల్లో అతనిని తీసుకొచ్చి మంచి దర్శకుడి వద్ద పెట్టానని ఆయన అన్నారు. తన భార్య ఆసుపత్రిలో ఉందని, డబ్బుల్లేవని బోయపాటి ఏడ్చినప్పుడు ఆమె ఆసుపత్రి బిల్లు మొత్తం తన భార్య భరించిందని, తాను తన ఓపెల్ ఆస్ట్రో కారిచ్చి ఆమెను ఆసుపత్రికి పంపించానని ఆయన గుర్తుచేసుకున్నారు. అలాంటి బోయపాటి గర్వం నెత్తికెక్కి తన గురించి అవాకులు చవాకులు మాట్లాడుతున్నాడని ఆయన మండిపడ్డారు. బోయపాటి కూడా తన కుమారుడిలాంటివాడేనని, ఆ గర్వం లేకపోయి ఉంటే బాగుండేదని ఆయన అభిప్రాయపడ్డారు. వంద సినిమాలకు మాటల రచయితగా, దర్శకుడిగా నిరూపించుకున్నానని ఆయన చెప్పారు. తనలో ఫైర్ అలాగే ఉందని ఆయన అన్నారు. ఇప్పటికి కూడా పదునైన డైలాగ్ లు రాయగలనని ఆయన చెప్పారు. తనకు రచయిత, నిర్మాత, నటుడు, దర్శకుడిగా చావాలని లేదని పోసానిగా పుట్టానని, పోసానిగా బతికి, పోసానిగా చావాలని ఉందని ఆయన తెలిపారు. గొప్ప రచయితలు శ్రీశ్రీ, ఆత్రేయలు ఎలా మరణించారో తనకు తెలుసని ఆయన అన్నారు. రచయితగానో లేదా ఇంకొకరిగానే చావాలని లేదని, పోసానిగా ఉండడమే తనకు చాలా ఇష్టమని ఆయన అన్నారు.