: ఓపక్క కష్టమైన క్యాచ్ ను పట్టి... మరోపక్క సులువైన క్యాచ్ ను వదిలేసిన ఉమేష్ యాదవ్!
టీమిండియా క్రికెటర్ ఉమేష్ యాదవ్ ఓపక్క ఎవరూ ఊహించని క్యాచ్ పట్టి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తి, మరోపక్క సులువైన క్యాచ్ ను వదిలేసి అందరికీ అసహనాన్ని కలిగించాడు. హార్దిక్ పాండ్యా వేసిన ఇన్నింగ్స్ 10 ఓవర్ నాలుగో బంతిని కోరీ అండర్సన్ మిడాఫ్ మీదుగా షాట్ ఆడాడు. అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ పై వేసిన బంతిని అండర్సన్ షాట్ కొట్టి ఫోర్ కు పంపించే యత్నం చేశాడు. అయితే మిడాఫ్ లో ఫీల్డింగ్ చేస్తున్న ఉమేష్ ఎవరూ ఊహించని విధంగా డైవ్ చేసి, బంతిని అద్భుతమైన రీతిలో అందుకున్నాడు. ఉమేష్ యాదవ్ ఆ తరహా క్యాచ్ అందుకోవడంతో అటు జట్టులోని సభ్యులు, ఇటు స్టేడియంలోని ప్రేక్షకులు ఆశ్చర్యపోవడమే కాకుండా ఆనందంలో మునిగితేలారు. ఉమేష్ మెరుపులాంటి క్యాచ్ కు అండర్సన్ సైతం ఆశ్చర్యపోయి నిరాశగా పెవిలియన్ కు చేరాడు. ఆ తర్వాత మరో ప్రయత్నంలో.. 33 ఓవర్ 2వ బంతిని జస్ ప్రీత్ బుమ్రా సంధించిన బంతిని టిమ్ సౌతీ భారీ షాట్ గా మలిచే ప్రయత్నం చేశాడు. ఈ బంతి గాల్లో లేచి ఉమేష్ యాదవ్ వద్దకు వెళ్లడంతో అంతా వికెట్ దక్కిందనే అనుకున్నారు. ఇంతలో ఎవరూ ఊహించని విధంగా ఉమేష్ యాదవ్ చేతిలో పడిన బంతి .. అంతలోనే అలా కిందకు జారిపోయింది. దీంతో సౌతీ బతికిపోయాడు. ఈ డ్రాప్ ను చూసిన చీఫ్ కోచ్ కుంబ్లే ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.