: సభకు మూడు వేల మందికి అనుమతి ఉంటే లక్షమంది హాజరయ్యారు.. అందుకే వారణాసిలో తొక్కిసలాట: అధికారులు
ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో బాబా జైగురుదేవ్ సభ సందర్భంగా భారీగా భక్తులు తరలిరావడంతో వారణాసి- చందౌలి మధ్య రాజ్‌ఘాట్ వంతెనపై తొక్కిసలాట జరిగి 19 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు గల ప్రధాన కారణాలను అధికారులు మీడియాకు తెలిపారు. సభకు మూడు వేల మంది భక్తులు రావడానికి మాత్రమే అనుమతి ఉందని వారు తెలిపారు. అయితే, పరిమితికి మించి లక్షమంది హాజరయ్యారని, అందుకే తొక్కిసలాట జరిగిందని పేర్కొన్నారు. మృతి చెందిన వారిలో 14 మంది మహిళలున్నట్లు తెలుస్తోంది. గాయాలపాలయిన మరో 20 మందిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. బాధితులకు వైద్య సాయం అందడంలో ఆలస్యమైన కారణంగా మృతుల సంఖ్య అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. ముందు జాగ్రత్తలు తీసుకోకుండానే సభ ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఈ ఘటనపై గోవాలో బ్రిక్స్ సదస్సులో ఉన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. ఘటనలో మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ఘటనను గురించి తెలియగానే తాను తీవ్ర ఆవేదనకు గురైనట్లు పేర్కొన్నారు. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగించాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు.