: తమిళనాడు గవర్నరుగా తెరపైకి నజ్మా, ఆనందిబెన్‌ల పేర్లు.. అతి త్వరలోనే కేంద్రం నుంచి ప్రకటన


తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అనారోగ్యం పాలై ఆసుపత్రిలోనే ఉండ‌డంతో ఆ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు ఆస‌క్తిక‌రంగా మారాయి. ఆమె సుదీర్ఘ‌కాలం ఆసుప‌త్రిలోనే విశ్రాంతి తీసుకోవల్సి ఉంటుంద‌ని వైద్యులు చెబుతున్న విష‌యం తెలిసిందే. రోశ‌య్య ప‌ద‌వీకాలం ముగిసి బాధ్య‌త‌ల నుంచి త‌ప్పుకున్నాక ప్ర‌స్తుతం ఆ రాష్ట్రానికి విద్యాసాగ‌ర్ రావు తాత్కాలిక గ‌వ‌ర్న‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తోన్న విష‌యం తెలిసిందే. త‌మిళ‌నాడులో పూర్తిస్థాయి గవర్నరుగా ఎవ‌రు నియామకమ‌వుతార‌నే అంశంపై రాజకీయవర్గాలు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నాయి. ఆ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్‌గా ఒక మహిళను నియమించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ముఖ్యంగా నజ్మా హెప్తుల్లా, ఆనందిబెన్‌ పటేల్‌ల పేర్లు ఆ జాబితాలో వినిపిస్తున్నాయి. కేంద్రం ఎవ‌రి పేరును ప్రక‌టిస్తుందోన‌ని స‌ర్వ‌త్ర ఉత్కంఠ నెల‌కొంది. ఇదిలా ఉంచితే, త‌మిళ‌నాడులో ప్ర‌భుత్వ కార్యకలాపాలు స్తంభించాయని కొంద‌రు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. దీంతో ఆ రాష్ట్రంలో పూర్తిస్థాయిలో గవర్నరును నియమించాలనే డిమాండ్లు ప‌లువురు రాజ‌కీయ పార్టీల నేత‌ల నుంచి వ‌స్తున్నాయి. ఈ అంశంపై దృష్టి సారించిన కేంద్రం నిన్న, మొన్న ఈ విష‌యంపై త‌ర్జ‌నభ‌ర్జ‌న‌లు జ‌రిపిన‌ట్లు తెలుస్తోంది. అందులో పలువురి పేర్లను ప్ర‌ముఖంగా చ‌ర్చించార‌ని సమాచారం. గుజరాత్‌ మాజీ ముఖ్యమంత్రి ఆనందిబెన్‌ పటేల్‌, కేంద్ర మాజీ మంత్రి నజ్మా హెప్తుల్లాల పేర్లే అందులో ప్ర‌ధానంగా వినిపించిన‌ట్లు తెలుస్తోంది. నజ్మా హెప్తుల్లా పేరు ఇంత‌కు ముందే తెర‌పైకి వ‌చ్చింది. రోశయ్య పదవీ కాలం ముగియ‌గానే నజ్మా హెప్తుల్లాకి పూర్తిస్థాయిలో ఆ బాధ్య‌త‌లు అప్ప‌జెప్పుతార‌ని అనుకున్నారు. కానీ, కేంద్రం ఆమెను మణిపూర్‌ గవర్నరుగా నియమించింది. త‌మిళ‌నాడు గ‌వ‌ర్న‌ర్ నియామ‌కం అంశంలో ఇప్పుడు మళ్లీ ఆమె పేరు విన‌ప‌డుతోంది. ఆమెను మణిపూర్‌ నుంచి తమిళనాడుకు బదిలీ చేసే అవకాశాలు ఉన్నట్లు, ఆమెనే తమిళనాడుకు గ‌వ‌ర్న‌ర్ గా నియ‌మిస్తే బాగుంటుంద‌ని కేంద్రం యోచిస్తోన్న‌ట్లు తెలుస్తోంది. తమిళనాడు కొత్త గవర్నరు నియామకంపై అతి త్వ‌ర‌లోనే కేంద్రం ప్ర‌క‌ట‌న చేయ‌నుంది.

  • Loading...

More Telugu News