: రాత్రికి రాత్రే 70 మంది ఐపీఎస్ లను బదిలీ చేసిన అఖిలేష్ ప్రభుత్వం
సమాజ్ వాది పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ ఇంట్లో ఏర్పడిన రాజకీయ గొడవలకు అక్కడి ఉన్నతాధికారులు సైతం సతమతమవుతున్నారు. ఎలాంటి కనీస సమాచారం కూడా లేకుండానే రాత్రికి రాత్రే 70 మంది ఐపీఎస్ అధికారులను అఖిలేష్ సింగ్ యాదవ్ ప్రభుత్వం బదిలీ చేసింది. వీరిలో సీనియర్ ఐపీఎస్ లు కూడా ఉండటం గమనార్హం. అసమర్థుడనే ఆరోపణలతో తొలుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని, అనంతరం, తన తండ్రి ములాయంకు దగ్గరి వారైన ఇద్దరు మంత్రులను అఖిలేష్ తప్పించారు. దీంతో, కుటుంబంలో రాజకీయ గొడవలు ప్రారంభమయ్యాయి. తండ్రి, కుమారుడి మధ్య వివాదాలు రాజుకున్నాయి. ఈ నేపథ్యంలో, పార్టీలోనే కాకుండా, ప్రభుత్వంలోనూ అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే, 70 మంది ఐపీఎస్ లను ట్రాన్స్ ఫర్ చేశారు. ఈ పరిణామం చర్చనీయాంశంగా మారింది.