: అరుదైన సర్జరీ చేసి కవలల తలలు వేరు చేసిన న్యూయార్క్ వైద్యులు
తలలు అతుక్కుని పుట్టిన కవలలకు అమెరికాలోని న్యూయార్క్ వైద్యులు అరుదైన శస్త్రచికిత్స నిర్వహించి, విజయం సాధించారు. 13 నెలల క్రితం జన్మించిన అనియాస్, జేడాన్ మెక్ డొనాల్డ్‌లకు 27 గంటల పాటు ఆపరేషన్ చేసిన వైద్యులు.. ప్రస్తుతం ఆ చిన్నారులు ఐసీయూలో చికిత్స పొందుతున్నారని చెప్పారు. సుమారు 25 లక్షల కాన్పుల్లో ఒక జంట ఈ చిన్నారుల్లా తలలు అతుక్కుని పుడతారని పేర్కొన్నారు. న్యూయార్క్‌లోని మోంటిఫోర్ ఆసుపత్రిలో జరిగిన ఈ అరుదైన శస్త్రచికిత్సలో చిన్నారుల తలలు వేరు చేసేందుకు 16 గంటల సమయం పడితే, తలలను పునర్ నిర్మించేందుకు మరో పదిగంటల సమయం పట్టిందట. డాక్టర్ జేమ్స్ గుడ్‌రిచ్ ఆధ్వర్యంలో ఈ శస్త్రచికిత్స జరిగింది. ఈ సర్జరీ కోసం మొత్తం 25 లక్షల డాలర్ల వరకు ఖర్చు పెట్టారు. ఈ కవలలను క్రేనియోఫాగస్ ట్విన్స్ అని అంటున్నారు. ఇలాంటి కవలల్లో మూడవ వంతు శాతం కవలలు జన్మించిన 24 గంటల్లోపే ప్రాణాలు కోల్పోతారని వైద్యులు పేర్కొన్నారు. అనియాస్, జేడాన్ కవలలు 1.5 నుంచి 2 ఇంచుల మందం బ్రెయిన్ టిష్యూ పంచుకున్నట్లు వైద్యులు తెలిపారు. అనియాస్, జేడన్‌లకు పునర్జన్మలాంటి జీవితాన్ని ప్రసాదించిన డాక్టర్ జేమ్స్ గుడ్‌రిచ్ బృందం ఇంతకు ముందుకు కూడా మొత్తం ఏడుగురి కవలల తలలను ఇదే పద్ధతిలో సర్జరీ ద్వారా వేరు చేశారు.