: అరుదైన రికార్డు నెలకొల్పిన పాకిస్థాన్ ఓపెనర్
అంతర్జాతీయ క్రికెట్ లో పాకిస్థాన్ ఓపెనర్ అజహర్ అలీ అరుదైన రికార్డు నెలకొల్పాడు. వెస్టిండీస్ తో టెస్టు సిరీస్ ఆడుతున్న పాకిస్తాన్ టెస్టు చరిత్రలో 400వ మ్యాచ్ ఆడుతోంది. ఈ మ్యాచ్ లో ఓపెనర్ అజహర్ అలీ 24 ఏళ్ల తరువాత డబుల్ సెంచరీ (208) సాధించిన పాక్ ఓపెనర్ గా నిలిచాడు. అంతే కాకుండా డే అండ్ నైట్ టెస్టులో డబుల్ సెంచరీ నమోదు చేసిన తొలి ఆటగాడిగా కూడా అరుదైన రికార్డు నెలకొల్పాడు. కెరీర్ లో ఇది అజహర్ అలీకి 50వ టెస్టు. కాగా, 1992లో ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానంలో పాక్ ఓపెనర్ ఆమీర్ సోహైల్ డబుల్ సెంచరీ చేశాడు. అతని తరువాత ఆ ఫీట్ మళ్లీ నమోదు కాలేదు. క్రీజులో నిలదొక్కుకున్న అజహర్ అలీకి సమీ అస్లామ్ (90), అసద్ షఫీఖ్ (67) బాబర్ అజామ్ (30 నాటౌట్) చక్కటి సహకారమందించారు. ఈ టెస్టులో 124 ఓవర్లు ముగిసేసరికి పాక్ 2 వికెట్లు కోల్పోయి 412 పరుగులు చేసింది.