: తన రికార్డు బద్దలు కొడితే చూడాలని ఉందంటూ.. పాక్ బౌలర్ కి గుడ్ లక్ చెప్పిన అశ్విన్
భారత్, పాకిస్థాన్ మధ్య అన్ని రంగాల్లోను ఒకరకమైన పోటీ నెలకొన్నదన్నది కాదనలేని సత్యం. ప్రధానంగా క్రికెట్ లో ఈ పోటీ మరింత ఎక్కువ కనిపిస్తుంది. న్యూజిలాండ్ తో ఆడిన టెస్టు సిరీస్ ద్వారా రవిచంద్రన్ అశ్విన్ అరుదైన ఘనతలు తన ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అశ్విన్ ను చిన్నబుచ్చేలా పాకిస్థాన్ స్పోర్ట్స్ జర్నలిస్టు ఫైజాన్ లఖానీ... అశ్విన్ రికార్డును కనుమరుగు చేస్తూ, 'టెస్టుల్లో వేగంగా వంద వికెట్లు తీసిన ఆసియా బౌలర్ రికార్డు'ను సాధించేందుకు యాసిర్ షాకి ఇదే మంచి అవకాశం అంటూ ట్వీట్ చేశాడు. అశ్విన్ టెస్టుల్లో వంద వికెట్ల ఫీట్ ను కేవలం 18 టెస్టుల్లోనే సాధించిన సంగతి తెలిసిందే. వెస్టిండీస్ తో 17వ టెస్టు ఆడుతున్న యాసిర్ షా ఇప్పటి వరకు 95 టెస్టు వికెట్లు పడగొట్టాడు. ఈ ట్వీట్ పై స్పందించిన రవిచంద్రన్ అశ్విన్.... 'యాసిర్ షాకి గుడ్ లక్.. అతనిలో ఆ ప్రతిభ ఉంది. ఈ రికార్డును అతను అందుకుంటే చూడాలని ఉంది' అంటూ రీట్వీట్ చేశాడు. దీంతో అశ్విన్ క్రీడా స్పూర్తిని అంతా అభినందిస్తున్నారు.