: 'దీన్ని మించిన రకం లేదు' అనడానికి, 'దీన్ని మించి నరకం లేదు' అనడానికి ఎంత తేడా?: 'రంగనాయకమ్మ' పుస్తకంపై వేద పండితుడు బంగారయ్య శర్మ
సామాజిక అభ్యదయ రచయిత్రి రంగనాయకమ్మ రచించిన 'ఏం చెప్పాయి వేదాలు?' అంటూ రాసిన పుస్తకం కలకలం రేపుతుండగా, దీనిపై టెలివిజన్ చానళ్లలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. టీవీ-9లో జరుగుతున్న చర్చలో పాల్గొన్న వేద పండితుడు బంగారయ్య శర్మ, వేదాల్లో ఎంతో మంచి వుందని, దాన్ని ప్రతిఒక్కరూ ఆచరించాలని కోరారు. చదివే వాళ్ల మనస్సును బట్టి, అర్థం చేసుకునే వాళ్ల తెలివితేటలను బట్టి వేదాలు బుర్ర కెక్కుతాయని అన్నారు. 'దీన్ని మించిన రకం లేదు' అనడానికి, 'దీన్ని మించి నరకం లేదు' అనడానికి ఎంత తేడా ఉందో, వేదాలను చదవడం, తెలుసుకోవడంలో ఎంతమాత్రం చిన్న తప్పు చేసినా అర్థంలో అంత తేడా వచ్చేస్తుందని అన్నారు. వేదాలు ఆటవిక అజ్ఞానమనడం అవివేకాన్ని సూచిస్తుందని హితవు పలికారు. ఈ చర్చకు హాజరైన, ఫోన్లో మాట్లాడుతున్న వేద పండితులు రంగనాయకమ్మ పుస్తకాన్ని నిషేధించాలని అంటున్నారు. ఇదే సమయంలో వేదాలు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులకు అనుకూలంగా ఉన్నాయని, ముఖ్యంగా బ్రాహ్మలకు అనుకూలంగా రాసుకున్నారని బహుజనసేన అధ్యక్షుడు కదిరె కృష్ణ ఆరోపించారు.