: వీవీ వినాయక్ గురువు, నటుడు, రచయిత వినయ్ మృతి
పలు చిత్రాలకు కథలను అందించడంతో పాటు ఎన్నో క్యారెక్టర్ పాత్రలు పోషించిన వినయ్ (గజ్జల వినాయక శర్మ) గత రాత్రి కన్నుమూశారు. 59 సంవత్సరాల వినయ్ కు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. బుధవారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురికావడంతో, ఆయన్ను గాంధీ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఈ తెల్లవారుఝామున ఆయన మరణించారు. ఓ బ్యాంకులో పనిచేస్తూ, పలు పత్రికల్లో కథలు రాసిన ఆయన, హైదరాబాద్ కు బదిలీ అయిన తరువాత, సినిమాల్లో ప్రయత్నించి విజయవంతమయ్యారు. ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్, వినయ్ శిష్యుడే. ఈవీవీ సత్యనారాయణ తీసిన 'చెవిలో పువ్వు' చిత్రంతో కథా రచయితగా పరిచయమైన వినయ్.. ప్రేమఖైదీ, అమ్మదొంగా వంటి సూపర్ హిట్ చిత్రాలకు కథలను అందించారు. వినయ్ మృతి పట్ల చిత్ర పరిశ్రమ పెద్దలు సంతాపాన్ని వెలిబుచ్చారు.