: లగ్జరీ కార్ల ద్వారా స్మగ్లింగ్ చేస్తున్న కారు డ్రైవర్ భార్య... రాజస్థాన్ లో అతిపెద్ద ఓపియమ్ రాకెట్ బట్టబయలు!
ఆమె పేరు సుమితా బిష్ణోయ్. వయసు 31 సంవత్సరాలు. రాజస్థాన్ లోని జోధ్ పూర్ నివాసి. ఆమె భర్త కేవలం కారు డ్రైవర్. పొట్ట గడుపుకునేందుకు కర్ణాటకలో పనిచేస్తుంటాడు. ఓ కేసును తిరగదోడుతున్న వేళ, పోలీసులకు సుమితపై అనుమానం వచ్చి నిఘా పెట్టి, సోదాలు జరిపితే, రాజస్థాన్ రాష్ట్రంలోనే అతిపెద్ద ఓపియమ్ (నల్లమందు) రాకెట్ బయటపడింది. లగ్జరీ కార్లలో ఎవరికీ అనుమానం రాకుండా ఓపియమ్ ను ఆమె సరఫరా చేస్తున్న తీరు పోలీసులను సైతం విస్తుపోయేలా చేసింది. ఆమె విలాసవంతమైన జీవితం గురించిన సమాచారం భర్తకు ఎంతమాత్రమూ తెలియకపోవడం గమనార్హం. కేసుకు సంబంధించి పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం... భర్త కర్ణాటకకు వెళ్లిన తరువాత జాలోర్ కు చెందిన మద్యం వ్యాపారి, డ్రగ్ స్మగ్లర్ రాజూరామ్ ఇక్రామ్ తో సుమితకు పరిచయం ఏర్పడింది. ఆపై అతనితో తిరుగుతూ, ఓపియమ్ వ్యాపారంలోని అన్ని రహస్యాలనూ అనతికాలంలోనే తెలుసుకుంది. ఓ సంవత్సరం క్రితం ఓపియమ్ ను తీసుకువెళుతున్న రాజూరామ్ ను పోలీసులు అరెస్ట్ చేయడంతో, ఆ మొత్తం వ్యాపారాన్ని, రాజు నెట్ వర్క్ ను సుమిత టేకోవర్ చేసింది. మధ్య ప్రదేశ్ లోని నీముచ్, రాజస్థాన్ లోని చిత్తోర్ గఢ్ జిల్లాల్లో ఓపియమ్ అధికంగా పండుతుంది. ఇక ఆ ప్రాంతాల వారితో మంచి సంబంధాలు పెట్టుకున్న సుమిత, లగ్జరీ కార్లను వినియోగించి, ఎవరికీ అనుమానం రాకుండా వ్యాపారం చేసింది. ఆ కార్లన్నింటిలో జీపీఎస్ సిస్టమ్స్ పెట్టి, అవి ఎప్పుడు, ఎక్కడ తిరుగుతున్నాయన్నది ఇంట్లో నుంచే నిఘా ఉంచేది. ఆమెను అరెస్ట్ చేశామని, కేసును మరింత లోతుగా దర్యాఫ్తు చేయాల్సి వుందని పోలీసు వర్గాలు వెల్లడించాయి.