: కేటీఆర్ ఒక్కడికే అన్ని శాఖలెందుకు?: వీహెచ్ ప్రశ్న
తెలంగాణ పంచాయతీరాజ్, ఐటీ, మున్సిపల్ శాఖా మంత్రి కేటీఆర్ ఒక్కడికే అన్ని శాఖలు ఎందుకు? అని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ ప్రశ్నించారు. ఈ రోజు ఆయన హైదరాబాదులో మాట్లాడుతూ, నగరంలో కురిసిన భారీ వర్షాలకు కొట్టుకుపోయిన రోడ్లు, నాలాలు బాగుపడలేదు కానీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ విదేశాలకు వెళ్లారని ఎద్దేవా చేశారు. హైదరాబాదులో గల్లీ గల్లీ తెలిసిన స్థానిక మంత్రులకు మున్సిపల్ శాఖను కేటాయిస్తే మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇలాంటి రోడ్లు చూస్తే పెట్టుబడిదారులు వస్తారా? అని తనకు ఆందోళనగా ఉందని ఆయన తెలిపారు. తెలంగాణలో జిల్లాలను ఏర్పాటు చేయడంతో ఆగిపోకుండా, ఏర్పాటు చేసిన జిల్లాలకు ఆర్థికసాయం కూడా చేయాలని ఆయన సూచించారు.