: దసరా అంటే ఇలానా? అంటూ మైసూర్ రాజు ట్వీట్ చేసిన చిత్రం... సోషల్ మీడియా వైరల్
దసరా వేడుకలు... ఈ పేరు వినగానే మొదట గుర్తుకు వచ్చేది మైసూర్ మహారాజా ప్యాలెస్. దసరా ఉత్సవాలను అత్యంత వైభవంగా జరిపే రాజవంశాల్లో మైసూర్ రాజులు ముందు నిలుస్తారు. ఇక ఈ సంవత్సరం దసరా వేడుకలు ముగిసిన అనంతరం మహారాజా యదువీర్ వడయార్ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పెట్టిన ఓ ఫోటో వైరల్ అయింది. "మాకు ఎంతో పవిత్రమైన ఈ భవనం మరో వార్షికోత్సవంలో ఇలాగే కనిపించదని ఆశిస్తున్నాను" అని క్యాప్షన్ పెడుతూ ఆయన ఉంచిన చిత్రంలో ఉత్సవ వేడుకల తరువాత అతిథులు కూర్చున్న దర్బార్ హాల్ ప్రాంగణం ఓ చెత్త కుప్పలా కనిపిస్తోంది. వాడి పారేసిన గ్లాసుల నుంచి ప్లాస్టిక్ చెత్త, పానీయాల బాటిళ్లు, అల్యూమినియం కంటెయినర్లు, మూటల కొద్దీ కట్టిన వేస్టే... ఇలా ఎంతో చెత్తగా కనిపిస్తోంది. "పరిశుభ్రమైన నగరమన్న మనకున్న పేరు చెడిపోకూడదు" అని కూడా యదువీర్ వ్యాఖ్యానించారు. ఇండియాలో అత్యంత పరిశుభ్రమైన నగరంలో గడచిన రెండేళ్లుగా మైసూర్ ఎంపికవుతున్న సంగతి తెలిసిందే. ఇక యదువీర్ పెట్టిన పోస్టుపై వేలకొద్దీ కామెంట్స్ వస్తున్నాయి.