: అత్యాచారం చేశాడు... బ్లేడుతో చర్మాన్ని చెక్కేశాడు... ఆపై బెయిల్ పై వచ్చి బెదిరించడంతో ఆత్మహత్యాయత్నం చేసిన బాధితురాలు
తనపై అత్యాచారం చేసి, బ్లేడుతో చర్మాన్ని చెక్కి తీవ్రంగా హింసించిన వ్యక్తి, జైలు నుంచి బెయిలుపై తిగొచ్చి 'అంతు చూస్తాను' అని బెదిరించడంతో 18 ఏళ్ల బాధితురాలు ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన ఘటన భోపాల్ లో కలకలం సృష్టించింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, గడచిన ఫిబ్రవరిలో బాధితురాలిని ఇటార్సీ సమీపంలో ఇద్దరు వ్యక్తులు అటకాయించి కిడ్నాప్ చేసి అత్యాచారం చేశారు. బ్లేడుతో శరీరంలోని పలు ప్రాంతాల్లో చెక్కేసి, కొన ప్రాణంతో ఉండగా వదిలేసి పారిపోయారు. ఆపై బాలిక ప్రాణాలతో బయటపడి కేసు పెట్టగా, నిందితులను జైలుకు పంపారు. ఇద్దరు నిందితుల్లో ఒకడికి బెయిల్ మంజూరైంది. బయటకు వచ్చిన ఆ వ్యక్తి, బాధితురాలిని బెదిరించడంతో హడలిపోయిన ఆ యువతి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. శరీరంలో 40 శాతం కాలిపోయిన స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆమెకు ప్రాణాపాయం లేదని, కోలుకునేందుకు మరింత సమయం పట్టవచ్చని వైద్యులు వెల్లడించారు. కాగా, బెయిల్ పై వచ్చిన నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.