: హిందూ మత పరిరక్షణే లక్ష్యంగా శ్రీలంకలో 'శివసేనాయి' ఆరంభం
హిందూ మత పరిరక్షణే ధ్యేయంగా శ్రీలంకలో 'శివసేనాయి' పేరిట సంస్థ ప్రారంభమయింది. శ్రీలంకలోని హిందువులు ఈ సంస్థను ఆరంభించారు. అన్యమతస్తుల దాడుల నుంచి రక్షణ పొందేందుకే ఈ సంస్థను స్థాపించినట్టు శివసేనాయి చీఫ్ మరవనుపులవు సచ్చితానంతన్ తెలిపారు. మహారాష్ట్రలోని శివసేనతో ప్రస్తుతానికి శివసేనాయికి ఎలాంటి సంబంధాలు లేవని... కానీ, ఆ సంస్థ మద్దతు తమకు ఉంటుందని చెప్పారు. భారత్ లోని ఆర్ఎస్ఎస్, వీహెచ్ పీ, హిందూ జన జాగృతి, శివసేన లాంటి సంస్థలతో రానున్న రోజుల్లో సంబంధాలు పెట్టుకుంటామని తెలిపారు. శ్రీలంకలోని హిందువుల్లో ఎక్కువ మంది శివుడిని కొలుస్తారని... అందుకే తమ సంస్థకు శివసేనాయి అనే పేరును పెట్టామని ఆయన వెల్లడించారు. శివసేనాయి ఇంకా నిర్మాణ దశలోనే ఉందని తెలిపారు. శ్రీలంకలో మత మార్పిడులకు వ్యతిరేకంగా చట్టం చేసేందుకు తమ సంస్థ పోరాడుతుందని చెప్పారు.