: మళ్లీ మొదటికి వచ్చిన ప్రజా సాధికార సర్వే... మరోసారి ఇంటింటికీ అధికారులు


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రజా సాధికార సర్వే మళ్లీ మొదటికి వచ్చింది. తొలి దఫాలో వేలి ముద్రల సేకరణ పూర్తి అస్తవ్యస్తం కావడంతో భవిష్యత్ అవసరాలను డేటా బేస్ ఎంతమాత్రమూ తీర్చలేదని ఉన్నతాధికారులు తేల్చి చెప్పడంతో, వేలి ముద్రల సేకరణ నిమిత్తం అధికారులు మళ్లీ ఇంటింటికీ తిరగనున్నారు. సమాచార నిధిని సేకరించేందుకు సాగుతున్న కసరత్తులో భాగంగా, ఇప్పటికే 60 శాతం ప్రజల వివరాలను అధికారులు సమీకరించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ శాఖలన్నింటికీ ఉపయోగపడటమే లక్ష్యంగా ఈ సర్వేను చేపట్టింది. సుమారు రెండు నెలల క్రితం చేపట్టిన ఈ కార్యక్రమం తుది దశకు చేరిన వేళ, తిరిగి ఇంటింటికీ తిరగాల్సి వచ్చిందని, అధికారుల మధ్య సమన్వయం లోపాలు తమకు మళ్లీ వీధుల్లో తిరగాల్సిన పని పెట్టాయని సర్వే ఉద్యోగులు వాపోయారు. వాస్తవానికి సర్వే ప్రారంభ సమయంలో కుటుంబ పెద్ద వేలిముద్ర సేకరిస్తే సరిపోతుందని చెప్పగా, తామూ అదే పని చేశామని, ఇప్పుడు భవిష్యత్ అవసరాలంటూ, అందరి వేలిముద్రలూ కావాలని స్పష్టం చేస్తున్నారని అంటున్నారు. బుధవారం సాయంత్రానికి 1.16 కోట్ల మంది వివరాలు సేకరించి వుండగా, వీరిలో దాదాపు 25 లక్షల మంది వేలిముద్రలు మాత్రమే డేటాలో ఉన్నాయి. ఇప్పుడు మిగతా వరందరి వేలిముద్రలనూ సేకరించాల్సి వుంది.

  • Loading...

More Telugu News