: అధికార పార్టీ ఎమ్మెల్యేల మధ్య మాటల యుద్ధం.. విస్తుబోయిన టీఆర్ఎస్ నేతలు


వికారాబాద్ జిల్లా ప్రారంభోత్సవం సందర్భంగా ఇద్దరు అధికార పార్టీ ఎమ్మెల్యేల మధ్య మాటల యుద్ధం ప్రారంభమైంది. చివరికి అది కాస్తా వేడెక్కి నువ్వెంత? అంటే నువ్వెంత? అన్న వరకు వెళ్లింది. ఇది చూసి అక్కడే ఉన్న పార్టీ నేతలు విస్తుబోయారు. తర్వాత కల్పించుకుని ఇద్దరికి సర్దిచెప్పాల్సి వచ్చింది. వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ ప్రారంభోత్సవం అనంతరం పార్టీ నేతలంతా ఆర్ అండ్ బీ అతిథి గృహానికి చేరుకున్నారు. వికారాబాద్ ఎమ్మెల్యే సంజీవరావు, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య పక్క పక్కన కూర్చుకున్నారు. ‘‘నీ వల్లే ఆ మండలాలు వికారాబాద్ జిల్లాలోకి రాకుండా పోయాయి. వికారాబాద్‌లో చేవెళ్ల వద్దన్న నీకు వికారాబాద్‌తో ఏం పని? మళ్లీ మళ్లీ ఇక్కడికెందుకు వస్తున్నావు?’’ అని యాదయ్యపై సంజీవరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన యాదయ్య ‘నన్ను రావద్దనడానికి నువ్వెవరు? ఇదేమైనా నీ జాగీరా?’’ అని ప్రశ్నించారు. దీంతో సంజీవరావు మధ్యలోనే కల్పించుకుని ‘నీ జాగీరా?’ అని ఎదురు ప్రశ్నించారు. ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం ముదురుతుండడంతో అక్కడే ఉన్న పార్టీ నేతలు జోక్యం చేసుకుని ఇద్దరికీ సర్ది చెప్పారు.

  • Loading...

More Telugu News