: పోలవరం నిధుల మంజూరులో ముందడుగు.. చర్చిద్దాం రమ్మంటూ ఏపీకి కేంద్ర జలవనరుల శాఖ పిలుపు
పోలవరం ప్రాజెక్టుకు నిధుల మంజూరు విషయంలో ముందడుగు పడింది. ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు ఇచ్చేందుకు నాబార్డు అంగీకరించడంతో కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ ఈ దిశగా అడుగులు వేస్తోంది. ఈ మేరకు శనివారం చర్చలకు రమ్మంటూ ఏపీ జలవనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్ కుమార్‌ను కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి, పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ) ముఖ్య కార్య నిర్వహణాధికారి అమర్జిత్ సింగ్ ఆహ్వానించారు. పోలవరం ప్రాజెక్టుపై అంచనా వ్యయాన్ని వివరించాలంటూ కేంద్ర జలవనరుల శాఖను కేంద్ర ఆర్థిక శాఖ కోరడంతోనే శశిభూషణ్‌కు ఆహ్వానం అందినట్టు తెలుస్తోంది. నిజానికి శనివారం కేంద్ర మంత్రిత్వ శాఖలు, కార్యదర్శులు పనిచేయరు. అయినా శశిభూషణ్‌ను ఆ రోజు రావాలని ఆహ్వానించడంతో పోలవరం విషయంలో కీలక చర్చలు జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.