: అగ్రహించిన కోహ్లీ...భజ్జీ అని తెలియగానే నెమ్మదించాడు
భారత్ లో ఆడే సిరీస్ లలో రవిచంద్రన్ అశ్విన్ వీరవిహారం చేస్తున్నాడు. పది వికెట్ల ఫీట్ సాధిస్తూ వరల్డ్ నెంబర్ వన్ స్పిన్నర్ గా ఎదిగాడు. కివీస్ తో మూడో టెస్టు నెగ్గిన అనంతరం అంతా అశ్విన్ ను పొగుడుతున్న వేళ.. సీనియర్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ చేసిన ట్వీట్ దుమారం రేపింది. పిచ్ లన్నీ స్పిన్ కు అనుకూలంగా ఉన్నాయన్నాడు. కుంబ్లే, తాను ఆడిన సమయంలో పిచ్ లు ఇలా ఉండి ఉంటే మరిన్ని ఎక్కువ వికెట్లే పడగొట్టేవాళ్లమని వ్యాఖ్యానించాడు. గత నాలుగు సంవత్సరాలుగా పిచ్ పరిస్థితులు స్పిన్ కు అనుకూలంగా ఉన్నాయని భజ్జీ ట్వీట్ చేశాడు. ఈ నేపథ్యంలో, కోహ్లీ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఓ జర్నలిస్టు ఇదే ప్రశ్న వేయగానే... కోహ్లీ అగ్గిమీద గుగ్గిలమయ్యాడు. 'ఎవరా ప్రశ్న అడిగింది?' అంటూ కోహ్లీ ఆవేశంగా ప్రశ్నించాడు. అయితే ఈ ప్రశ్న తాను వేసింది కాదని, హర్భజన్ సింగ్ అన్నదని సదరు జర్నలిస్టు చెప్పగానే కోహ్లీ డిఫెన్స్ లో పడ్డాడు. ఒక్కసారిగా కూల్ అయిపోయి, స్పిన్ పిచ్ అయినప్పటికీ వికెట్లు పడటానికి బాగా బౌలింగ్ చేయాల్సిందేనని అన్నాడు. బౌలింగ్ లో స్పిన్ కేవలం పిచ్ వల్లే రాదని, భుజం కదలికలను బట్టి వస్తుందని పాఠాలు చెప్పాడు. గతంలో తాము కివీస్ పై టీ20 సిరీస్ లో ఓటమిపాలయ్యామని, అప్పుడు వాళ్ల స్పిన్నర్లు బాగా బౌలింగ్ చేశారని సమాధానమిచ్చాడు. ఎవరు బాగా ఆడితే వారినే విజయం, వికెట్లు వరిస్తాయని తాజాగా జవాబిచ్చాడు.