: లోకేష్ ను చూసి ఓర్వలేకే వైఎస్సార్సీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు: ఏపీ మంత్రి పల్లె
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఎదుగుదల చూసి ఓర్వలేకే వైఎస్సార్సీపీకి చెందిన నేతలు విమర్శలు చేస్తున్నారని మంత్రి పల్లె రఘునాథరెడ్డి మండిపడ్డారు. అనంతపురంలో ఆయన మాట్లాడుతూ, లోకేశ్ పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలోనే పలువురు నేతలకు సలహాలు, సూచనలు ఇస్తారని అన్నారు. దానిని ప్రతిపక్షాలు రాద్ధాంతం చేయడం సరికాదని ఆయన సూచించారు. వైఎస్సార్సీపీ అధినేత జగన్ తో లోకేశ్ కు ఏమాత్రం పోలిక లేదని ఆయన చెప్పారు. జగన్ అహంకారం, అవినీతికి నిలువుటద్దమని ఆయన ఆరోపించారు. పదేళ్లు అధికారంలో ఉండి రైతులకు ఏమీ చేయని కాంగ్రెస్ నేతలు తమ ప్రభుత్వాన్ని విమర్శించడం చిత్రంగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. ఆ పార్టీ చేసిన ద్రోహానికి ప్రజలు వారిని తరిమికొట్టారని ఆయన తెలిపారు. మరో వందేళ్లైనా ఆ పార్టీ ఏపీలో కోలుకునే అవకాశాలు లేవని ఆయన జోస్యం చెప్పారు.