: జిల్లాల ఏర్పాటు పూర్తయింది... మార్పులకు, చేర్పులకు అవకాశం లేదు
కొత్త జిల్లాల ఏర్పాటు పూర్తయిందని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు పూర్తి స్థాయిలో ఏర్పడ్డాయని తెలిపింది. వీటి ఏర్పాట్లకు సంబంధించి ప్రజలు సమర్పించిన విన్నపాలను క్షుణ్ణంగా పరిశీలించామని... ఆ తర్వాతే వీటి ఏర్పాటుకు తుది నోటిఫికేషన్ ఇచ్చామని పేర్కొంది. ఇప్పటి నుంచి కొత్తగా ఏర్పాటైన జిల్లా కేంద్రాల నుంచే పాలన కొనసాగుతుందని తెలిపింది. పూర్తిగా శాస్త్రీయంగానే జిల్లాల ఏర్పాటు జరిగిందని... ఇకపై కొత్త డిమాండ్లను స్వీకరించే అవకాశం ఎంతమాత్రం లేదని తేల్చి చెప్పింది. విజయదశమి సందర్భంగా తెలంగాణలో కొత్తగా 21 జిల్లాలు ఏర్పాటైన విషయం తెలిసిందే. దీంతో, రాష్ట్రంలోని జిల్లాల సంఖ్య 31కి పెరిగింది.