: భవిష్యత్తులో తానేం చేస్తానన్నది వెల్లడించిన డేవిడ్ కామెరాన్
బ్రిటన్ ప్రధానిగా ఉండి బ్రెగ్జిట్ కు వ్యతిరేక ప్రచారం చేసి, ఆపై ఓటమితో పదవికి రాజీనామా చేసిన డేవిడ్ కామెరాన్, తాను భవిష్యత్తులో చేయబోయే పని గురించి తెలిపారు. రాజకీయ జీవితాన్ని వదిలివేసిన తాను యువతీ యువకుల కోసం నేషనల్ సిటిజన్ సర్వీస్ (ఎన్సీఎస్) విస్తరణకు పూర్తి సమయాన్ని కేటాయించనున్నట్టు వెల్లడించారు. ఈ మేరకు 'డైలీ టెలిగ్రాఫ్'కు ఓ ఆర్టికల్ రాస్తూ, తన హయాంలో ఎన్సీఎస్ ప్రారంభం కావడం తనకు గర్వకారణమని, ఇందులో ఇప్పటికే 2.75 లక్షల మందికి పైగా భాగస్వాములున్నారని తెలిపారు. సాంఘిక అసమానతలను తొలగించేందుకు వివిధ రకాల వారధులను ఎన్సీఎస్ నిర్మిస్తోందని, యువతలో నైపుణ్యాభివృద్ధికి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ను పెంచేందుకు సహకరిస్తోందని తెలిపారు. వివిధ రకాల కమ్యూనిటీ ప్రాజెక్టులు, బృంద కార్యకలాపాల్లో ఎన్సీఎస్ టీనేజర్లు భాగస్వామ్యమవుతున్నారని తెలిపారు. కాగా, ఇకపై వివిధ ఎన్సీఎస్ విభాగాలకు కామెరాన్ చైర్మన్ గా విధులు నిర్వహించనున్నట్టు బీబీసీ పేర్కొంది.