: భారత్ ను దెబ్బకొట్టేందుకు 'సార్క్' స్థానంలో 'ఆర్క్' ఏర్పాటుకు పాక్ కుటిల యత్నం!
ఉగ్రదాడుల నేపథ్యంలో పాకిస్థాన్ లో జరగాల్సిన సార్క్ (సౌత్ ఆసియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్) దేశాల కూటమి సమావేశాలకు హాజరు కాకూడదని భారత్ నిర్ణయించుకోగా, మిగతా సభ్య దేశాలూ అదే బాటన నడవడంతో పరువు పోగొట్టుకున్న పాక్, సార్క్ కు దీటుగా మరో ఆర్థిక కూటమిని ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఆసియా దేశాల స్థాయిలో సార్క్ స్థానంలో 'ఆసియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్' (ఆర్క్) పేరిట కొత్త కూటమిని ప్రారంభించాలని యోచిస్తున్నట్టు బుధవారం నాడు 'డాన్' ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. న్యూయార్క్ లో పర్యటిస్తున్న పాక్ పార్లమెంటరీ బృందం ఈ ఆలోచన చేస్తున్నట్టు తెలిపింది. సార్క్ లో భారత్ ప్రభావం అధికంగా ఉండటం, తమకు ఇబ్బందులు కలిగిస్తోందన్న అంచనాతోనే పాక్ ఈ నిర్ణయపై సమాలోచనలు చేస్తున్నట్టు తెలుస్తోంది. పాక్ ఎంపీ ముషాహిద్ హుస్సేన్ సయ్యద్, మీడియాతో మాట్లాడుతూ, దక్షిణాసియా స్థాయిలో మరింత బలమైన కూటమి ఏర్పాటు ఆలోచనలో ఉన్నామని, ఇందులో ఇరుగు, పొరుగున ఉన్న చైనా, ఇరాన్ తదితర దేశాలనూ భాగస్వాములుగా చేసే ఆలోచన ఉందని ఆయన తెలిపారు. సౌతాసియా, మధ్య ఆసియా దేశాలకు 'చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్' వాణిజ్య వారధిగా సేవలందిస్తోందని తెలిపిన ఆయన, కావాలనుకుంటే కొత్త కూటమిలో భారత్ కూడా చేరవచ్చని ఆఫర్ ఇవ్వడం గమనార్హం.