: నీ రొట్టెను నువ్వు తింటే అది ప్రకృతి.. పక్కవాడికి పెడితే అది సంస్కృతి: వెంకయ్య నాయుడు
ప్రతి ఏటా కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ నిర్వహించే అలయ్ బలయ్ కార్యక్రమం ఈరోజు ప్రారంభమైంది. హైదరాబాద్‌లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో కొనసాగుతున్న ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు, రాష్ట్రమంత్రి నాయిని నర్సింహారెడ్డి, బీజేపీ నేత చింతల రామచంద్రారెడ్డి, హైదరాబాద్ సీపీ మహేందర్‌రెడ్డి, వివిధ పార్టీల నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఒకరికొకరు అలయ్ బలయ్ ఇచ్చుకొని ఉత్సాహంగా కనిపించారు. కార్యక్రమంలో వెంకయ్యనాయుడు మాట్లాడుతూ... ‘నీ రొట్టెను నువ్వు తింటే అది ప్రకృతి, పక్క వాడిది లాక్కొని తింటే వికృతి, పక్కవాడికి పెడితే అది సంస్కృతి.. పక్కవాడికి కూడా పెట్టే భావం అందరిలోనూ ఉండాలి. పాముకి పాలు, చీమకి చక్కెర వేస్తాం. అలాంటి దేశంలో ఒకే జాతి భావంతో మెలగాల్సిన అవసరం ఉంది. మన సంస్కృతిని గౌరవిస్తూ అందరం కలిసి దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలి. మనందం ఒక్కటే అనే భావనను తెలిపేదే అలయ్ బలయ్ కార్యక్రమం’ అని ఆయన వ్యాఖ్యానించారు.