: ‘స్కిన్ బ్యాంకు’కు చర్మాన్ని దానం చేసిన వృద్ధుడు
ఓ వృద్ధుడు తన శరీర చర్మాన్ని విరాళంగా అందించిన ఘటన ముంబయి పరిధిలోని ఘట్కోపర్ ప్రాంతంలో జరిగింది. ఇటీవలే తన 99వ పుట్టినరోజుని జరుపుకున్న సోమాలాల్ అనే వృద్ధుడు అనారోగ్యం కారణంగా నిన్న మరణించాడు. అవయవదానం చేసి మరొకరికి ప్రాణం పోయడమంటే సోమాలాల్ తోపాటు ఆయన కుటుంబ సభ్యులందరూ అమితమైన ఆసక్తిని కనబరిచేవారు. సోమాలాల్ చనిపోయిన తరువాత అతడి మనవడు కేతన్.. సోమాలాల్ అవయవాలను దానం చేయాలని నిర్ణయించుకొని ఆ విషయాన్ని డాక్టర్లకు తెలియజేశాడు. అయితే, కురు వృద్ధుడైన సోమాలాల్ అవయవాలు తాము తీసుకోలేమని వైద్యులు కేతన్కి తెలిపారు. సోమాలాల్ చర్మాన్ని తీసుకొని కాలిన గాయాలతో బాధపడుతున్న రోగులకు అతికించవచ్చని డాక్టర్లు కేతన్కి చెప్పారు. దీంతో తమ తాత చర్మాన్ని తీసుకోవాల్సిందిగా వైద్యులను ఆయన కోరాడు. వైద్యులు సోమాలాల్ చర్మాన్ని తీసుకుని స్కిన్ బ్యాంకులో ఉంచారు. తాము మృతుల చర్మాన్ని దానంగా తీసుకొని అవసరమైన రోగులకు అతికిస్తున్నామని నేషనల్ బర్న్స్ సెంటరులో ఉన్న స్కిన్ బ్యాంకు ఇన్ చార్జి డాక్టర్ సతోస్కర్ మీడియాకు తెలిపారు. చర్మాన్ని దానం చేయడానికి కూడా అధికంగానే ఆసక్తి కనబరుస్తున్నారని ఆయన చెప్పారు.