: ఉగ్రదాడులు జరుగుతున్నప్పుడు యుద్ధాలు తప్పవు: మోదీ సంచలన వ్యాఖ్యలు


ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో జరిగిన రాంలీలా ఉత్సవాల్లో పాల్గొన్న సందర్భంగా ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. 'జై శ్రీరాం' అంటూ ప్రసంగం ప్రారంభించిన మోదీ, దేశవ్యాప్తంగా దసరా ఉత్సవాలు నిర్వహించుకుంటున్న ప్రజలందరికీ శుభాకాంక్షలు చెప్పారు. రావణ సంహారం అంటే చెడుపై మంచి విజయం సాధించడమని అన్నారు. మనలో లోపాలు సవరించుకున్నప్పుడు ప్రశాంతంగా జీవించడం సాధ్యమని ఆయన చెప్పారు. ప్రస్తుత ప్రపంచంలో ఉగ్రవాదం మానవత్వానికి శత్రువని అన్నారు. ఉగ్రదాడులు చోటుచేసుకుంటున్నప్పుడు యుద్ధాలు తప్పవని ఆయన పాకిస్థాన్‌ ను పరోక్షంగా హెచ్చరించారు. ఉగ్రవాదానికి ఊతమిస్తున్న దేశాలను ప్రపంచం వెలివేయాలని ఆయన పిలుపునిచ్చారు. ముంబై దాడుల తరువాత ఉగ్రవాదుల వల్ల కలిగే నష్టాన్ని ప్రపంచం గుర్తించిందని ఆయన తెలిపారు. ఉగ్రవాదంపై పోరాడిన తొలి యోధుడి పేరు జటాయువని ఆయన పేర్కొన్నారు. ఒక మహిళ మాన, ప్రాణాలను కాపాడేందుకు జటాయువు ప్రాణత్యాగం చేశాడని ఆయన పేర్కొన్నారు. నవనాగరిక సమాజంలో మనం కూడా జటాయువులా ఉండటం అవసరమని ఆయన సూచించారు. దేశ ప్రజలంతా అప్రమత్తంగా ఉంటే ఉగ్రవాదుల ఆటలు సాగవని ఆయన సూచించారు. ఉగ్రవాదులను పెంచి పోషించే వాళ్లను ఉపేక్షించరాదని ఆయన తెలిపారు. ఉగ్రవాదాన్ని అంతమొందించే వరకు మానవాళిని కాపాడుకోవడం కష్టమేనని, సమాజానికి చేటుతెచ్చేవారంతా రావణులేనని, వారిని అంతమొందించక తప్పదని మోదీ స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News