: 115 పాయింట్లతో టెస్టు ర్యాంకుల్లో టీమిండియా నెంబర్ వన్.. రెండో స్థానంలో పాక్!
న్యూజిలాండ్, భారత్ టెస్టు సిరీస్ ముగిసింది. మూడు టెస్టుల్లో అద్భుతమైన విజయం సొంతం చేసుకున్న భారత జట్టు సిరీస్ ను క్లీన్ స్వీప్ చేయడం ద్వారా సగర్వంగా వరల్డ్ నెంబర్ వన్ టెస్టు జట్టుగా నిలిచింది. దీంతో 115 పాయింట్లతో భారత జట్టు వరల్డ్ నెంబర్ వన్ గా నిలిచింది. ఐసీసీ అధికారికంగా ర్యాంకింగ్స్ ను ప్రకటించి, మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ చేతుల మీదుగా కోహ్లికి వరల్డ్ నెంబర్ వన్ ర్యాంకర్ ను సూచించే గదను బహూకరించనుంది. 2003లో టెస్టు క్రికెట్ లో ర్యాంకింగ్స్ ప్రవేశపెట్టాక ఇటీవల పాకిస్థాన్ తొలిసారి అగ్రస్థానానికి చేరుకుంది. అయితే టీమిండియా కారణంగా పాక్ నెంబర్ వన్ ఘనత మూణ్ణాళ్ల ముచ్చటగా మారింది. దీంతో పాక్ మళ్లీ రెండో స్థానానికి పడిపోయింది. న్యూజిలాండ్ తో సిరీస్ అనంతరం భారత్ సొంతగడ్డపై ఇంగ్లాండ్, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియాతో సుదీర్ఘంగా టెస్టు సిరీస్ లు ఆడనుండగా, పాకిస్థాన్ కూడా వెస్టిండీస్, ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లు ఆడనుంది. దీంతో టెస్టు ఛాంపియన్ షిప్ విషయంలో ఈ రెండు జట్ల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంటుందని క్రీడా విశ్లేషకులు పేర్కొంటున్నారు. అయితే భారత్ పాయింట్ల పట్టికలో కాస్త దూరంగా ఉండడంతో మళ్లీ వరల్డ్ నెంబర్ వన్ గా పాక్ నిలవాలంటే చాలా శ్రమించాల్సి ఉంది.