: వీడిన మహిళా జడ్జి హత్య మిస్టరీ... పక్కటెముకలు విరిచి దారుణ హత్య
జడ్జి హోదాలో ఉన్నప్పటికీ ఆమెకు కూడా వేధింపులు తప్పలేదు. ఎంతోమంది సామాన్య మహిళల్లాగానే ఆమె కూడా దారుణ హత్యకు గరైంది. కాన్పూర్ లో ప్రతిభ గౌతమ్ అనే మహిళా జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ప్రేమించి పెళ్లిచేసుకున్న భర్తే ఆమెను అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. వివరాల్లోకి వెళ్తే, ఇటీవల ప్రతిభ గర్భం దాల్చింది. అయితే, తనకు ఇష్టం లేదని, వెంటనే అబార్షన్ చేయించుకోవాలని ఆమె భర్త మను అభిషేక్ ఆమెపై ఒత్తిడి తెచ్చాడు. అంతేకాదు, చిత్ర హింసలకు గురిచేశాడు. ఆ తర్వాత హత్య చేశాడు. ఆ తర్వాత ఏమీ తెలియనట్టు, తన భార్య ఆత్మహత్యకు పాల్పడిందంటూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేపట్టారు. అయితే, పోస్ట్ మార్టమ్ రిపోర్ట్ లో అసలు నిజం వెల్లడైంది. ఆమె శరీరంపై బలమైన గాయాలున్నాయని... ఒకవైపు ఎనిమిది చోట్ల, మరోవైపు ఐదు చోట్ల పక్కటెముకలు విరిగిపోయాయని... శరీరంలోని సున్నిత అవయవాలను కూడా ధ్వసం చేసే ప్రయత్నం జరిగిందని... ఆ తర్వాత ఊపిరి ఆడకుండాచేసి, హత్య చేశారని రిపోర్టులో వెల్లడైంది. దీంతో, ఆమె భర్త అభిషేక్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.