: రక్తం రుచి చూడటానికి వేలాది కర్రలు సిద్ధం...దేవరగట్టు ఉత్సవంలో కర్రల సమరం!
కర్నూలు జిల్లా హొళగుంద మండలంలో జరిగే దేవరగట్టు ఉత్సవం అంటే తెలియని వారుండరు. భక్తి పేరుతో ప్రతి ఏటా విజయదశమి రోజున అక్కడ కర్రల సమరం జరుగుతుంది. కళ్ల నిండా భక్తి, కర్రల్లో పౌరుషం... మొత్తం మీద రక్తాభిషేకం. ఈ కర్రల సమరాన్ని ఆపేందుకు పోలీసు శాఖ ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ... ఫలితం మాత్రం శూన్యం. అనాదిగా వస్తున్న తమ ఆచారాన్ని వదలమని స్థానికులు స్పష్టం చేయడంతో పోలీసులు సైతం ఏమీ చేయలేక పోతున్నారు. హెచ్చార్సీ, లోకాయుక్త ఆదేశాలను కూడా కాదని... రేపటి విజయదశమికి దేవరగట్టులో కర్రల సమరానికి సర్వం సిద్ధమయింది. దీంతో, ఉత్సవం జరిగే సమయంలో ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు చోటు చేసుకోకుండా పోలీసులు కూడా భారీ భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. ఏకంగా 1300 మండి పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతను కల్పించనున్నారు. జిల్లా ఎస్పీ కూడా స్వయంగా రంగంలోకి దిగి, పరిస్థితిని పర్యవేక్షించనున్నారు. నిఘా కోసం ఆధునికి టెక్నాలజీని, డ్రోన్లను వినియోగిస్తున్నామని ఎస్పీ తెలిపారు. కర్రలకు బదులు ఎవరైనా ఇనుప చువ్వలను వాడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. దేవరగట్టు ఉత్సవం విషయానికి వస్తే... ఈ చుట్టు పక్కల గ్రామాలకు కులదైవం మాల మల్లేశ్వర స్వామి. కూర్మావతారంలో ఉన్న ఆయనను ఇక్కడి వారు భక్తిశ్రద్ధలతో కొలుస్తారు. దసరా రోజున జరిగే ఉత్సవంలో ఉత్సవమూర్తిని ఏ గ్రామం వారు తీసుకెళ్తే... ఆ గ్రామానికి మేలు జరుగుతుందని నమ్మకం. దీంతో, స్వామివారి విగ్రహాలను తీసుకెళ్లేందుకు చుట్టుపక్కల గ్రామస్తులు తరలి వస్తారు. మండలంలోని విరుపాపురం, అరికేర, కురుకుంద, ముద్దనగేరి, ఆలూరు, నెరణికి, నెరణికి తాండా ప్రజలు ఈ ఉత్సవంలో పాల్గొంటారు. వారంతా వేలాది కర్రలతో దేవరగట్టుకు తరలి వస్తారు. విగ్రహాన్ని తీసుకుపోయే క్రమంలో... నిర్దాక్షిణ్యంగా కర్రలతో తలలు పగలగొట్టుకుంటారు. ఈ ఉత్సవాల్లో ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా చాలా ఉన్నాయి. పాత కక్షల నేపథ్యంలో, ఉత్సవం సమయంలో ప్రత్యర్థులను మట్టుబెట్టారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ ఉత్సవాన్ని బన్ని ఉత్సవం అని కూడా అంటారు. మరోవైపు, కర్రల సమరాన్ని చూసేందుకు కర్ణాటక, మహారాష్ట్రల నుంచి కూడా వేలాది మంది దేవరగట్టుకు తరలి వస్తున్నారు.