: టీషర్ట్ పై పిచ్చి రాతలు... ఇరకాటంలో ప్రియాంకచోప్రా
హాలీవుడ్ సిరీస్ 'క్వాంటికో'లో హాట్ హాట్ సీన్లతో జనాలకు పిచ్చెక్కించిన బాలీవుడ్ బ్యూటీ ప్రియాంకచోప్రా వివాదంలో ఇరుక్కుంది. ట్రావెలర్ మేగజీన్ కవర్ పేజీపై ఈ అమ్మడు వేసుకున్న టీషర్ట్ ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. ఆ కవర్ పేజ్ పిక్ ను ట్విట్టర్ లో పోస్ట్ చేసిన తర్వాత నెటిజన్లు ఆమెపై విమర్శలు గుప్పించడం మొదలు పెట్టారు. జనాలకు అంత కోపం తెప్పించే విధంగా ఆ టీషర్ట్ పై ఏముందనేగా మీ సందేహం. తెల్లటి టీషర్ట్ పై... రెఫ్యూజీ (శరణార్థి), ఇమ్మిగ్రెంట్ (వలసవాది), ఔట్ సైడర్ (బయటి వాడు), ట్రావెలర్ (ప్రయాణికుడు) అనే పదాలు ఓ బాక్స్ లో ఉన్నాయి. వీటిలో రెఫ్యూజీ, ఇమ్మిగ్రెంట్, ఔట్ సైడర్ అనే పదాలను కొట్టివేసి... ట్రావెలర్ అనే పదం మాత్రం వదిలివేసి ఉంది. దీనిపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. బతకడం అసాధ్యమైన సందర్భంలో ప్రతిరోజు శరణార్థులుగా, వలసవాదులుగా ఇతరదేశాలకు తరలిపోతున్న వారిని కించపరిచేలా ఈ రాతలు ఉన్నాయని వారు మండిపడుతున్నారు. ప్రపంచంలో అత్యధిక పారితోషికం తీసుకునే టీవీ నటి (క్వాంటికో టీవీ సీరియల్)కి శరణార్థుల బాధలు ఏమి తెలుస్తాయని ప్రశ్నిస్తున్నారు. ఈ కారణం వల్లే జాత్యహంకార ధోరణితో, మూర్ఖంగా ఉన్న రాతలతో కూడిన టీషర్ట్ ను ప్రియాంక ధరించిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.