: నేను మారిన మనిషినన్న ట్రంప్.. ఆ లీక్‌లో తన తప్పుందన్న హిల్లరీ.. వాడివేడిగా సాగుతున్న మాటల యుద్ధం


సెయింట్ లూయిస్ లోని వాషింగ్టన్ యూనివర్సిటీలో హిల్లరీ క్లింటన్, డొనాల్డ్ ట్రంప్ మధ్య జరుగుతున్న రెండో డిబేట్ వాడివేడిగా సాగుతోంది. ఇద్దరి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. విమర్శలు, ప్రతివిమర్శలతో వాతావరణం క్రమంగా వేడెక్కుతోంది. హిల్లరీ వ్యక్తిగత జీవితంపై ట్రంప్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కొత్త ఉద్యోగాలు కల్పించడంలో హిల్లరీ ఘోరంగా విఫలమయ్యారని ఆరోపించారు. తాను మారిన మనిషినని అన్నారు. బిల్ క్లింటన్ మహిళలకు చేసిన అన్యాయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని ట్రంప్ అన్నారు. 12 ఏళ్ల బాలికపై బిల్ క్లింటన్ అత్యాచారానికి పాల్పడ్డారని, అయినా హిల్లరీ నోరు మెదపలేదని ఆరోపించారు. ఎప్పుడో 11 ఏళ్ల క్రితం తాను మాట్లాడిన మాటలను తెరపైకి తేవడం తప్పన్నారు. ఈ-మెయిల్ లీక్‌పై హిల్లరీ సమాధానం చెప్పాలని ట్రంప్ డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేయిస్తే హిల్లరీ జైలు కెళ్లడం ఖాయమని అన్నారు. ఈ-మెయిల్ లీక్‌పై హిల్లరీ మరోసారి అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. 39వేల ఈమెయిల్స్ లీకైనప్పటికీ తప్పు జరగలేదనడం దారుణమని పేర్కొన్నారు. హిల్లరీ క్లింటన్ మాట్లాడుతూ.. ట్రంప్ వ్యాఖ్యలు మహిళలపై ఆయనకున్న గౌరవానికి నిదర్శనమని విమర్శించారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ అర్హుడు కాదనడానికి ఇంతకంటే వేరే నిదర్శనం ఏమీ ఉండదన్నారు. భిన్నత్వంలో ఏకత్వానికి అమెరికా ప్రతీక అని స్పష్టం చేశారు. అధ్యక్షుడు ఒబామాపై ట్రంప్ దారుణమైన వ్యాఖ్యలు చేశారని హిల్లరీ అన్నారు. ట్రంప్ ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదని పేర్కొన్నారు. ఈ -మెయిల్ వ్యవహారంలో తన తప్పు ఉందని, దానికి గతంలోనే తాను క్షమాపణలు చెప్పానని హిల్లరీ గుర్తు చేశారు.

  • Loading...

More Telugu News