: రహానే సెంచరీ... 300 దాటి, భారీ స్కోరు దిశగా దూసుకెళ్తున్న భారత్
ఓ వైపు విరాట్ కోహ్లీ, మరో వైపున రజింక్యా రహానే కుదురుకొని నిలకడగా ఆడుతూ, అవకాశం చిక్కినప్పుడల్లా బంతిని బౌండరీకి తరలిస్తుండటంతో, పేటీఎం సిరీస్ లో భాగంగా ఇండోర్ లో జరుగుతున్న మూడవ టెస్టులో భారత్ తొలి ఇన్నింగ్స్ భారీ స్కోరు దిశగా సాగుతోంది. తొలి రోజున 3 వికెట్ల నష్టానికి 267 పరుగులు చేసిన భారత జట్టు, రెండో రోజు ఆటను నిదానంగా ప్రారంభించి, ఆపై దూకుడు పెంచింది. ఈ క్రమంలో 98.1 ఓవర్ వద్ద భారత జట్టు స్కోరు 300 పరుగులను దాటింది. ఇదే బంతికి రహానే, కోహ్లీల భాగస్వామ్యం 200 పరుగుల మైలురాయినీ తాకింది. ఆపై 102వ ఓవర్ లో రహానే తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 102వ ఓవర్ తొలి బంతిని బౌండరీకి పంపి సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఇది రహానే కెరీర్ లో 8వ సెంచరీ. ప్రస్తుతం విరాట్ కోహ్లీ 220 బంతుల్లో 12 ఫోర్ల సాయంతో 122 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉండగా, భారత జట్టు 101.1 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 306 పరుగులు చేసి భారీ స్కోరు దిశగా సాగుతోంది.