: భారత్, పాక్ కొంపముంచుతున్న ‘బ్యాన్’.. రూ. 100 కోట్ల వరకు నష్టపోతున్న బాలీవుడ్ చిత్ర పరిశ్రమ


ఉరీ ఉగ్ర ఘటన తర్వాత భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు తలెత్తడం, ఆ తర్వాత బాలీవుడ్‌లోని పాక్ నటీనటులపై నిషేధం విధించడం, దీనికి ప్రతీకారంగా పాకిస్థాన్‌లో బాలీవుడ్ సినిమాలపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. కాగా ఇరు దేశాలు తీసుకున్న ఈ నిర్ణయంతో బాలీవుడ్‌కు వంద కోట్ల రూపాయల వరకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రతి ఏడాది పాకిస్థాన్‌లో 50 వరకు బాలీవుడ్ సినిమాలు విడుదల అవుతున్నాయి. సగటున ఒక్కో సినిమా రూ.1.5-2 కోట్ల వరకు వసూలు చేస్తోంది. ఇప్పటి వరకు పాకిస్థాన్‌లో కలెక్షన్ల పరంగా దుమ్మురేపిన సినిమా ఆమిర్‌ఖాన్ నటించిన ‘ధూమ్3. ఇది రూ.16 కోట్లు వసూలు చేసి సంచలనం సృష్టించింది. ఆ తర్వాత ‘పీకే’, సల్మాన్ ఖాన్ నటించిన ‘భజరంగీ భాయ్‌జా‌న్’ ‘సుల్తాన్’ తదితర సినిమాలు కూడా పాక్ బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాయి. దాదాపు రూ.22 కోట్ల వరకు వసూలు చేశాయి. అయితే పాకిస్థాన్‌లో బాలీవుడ్‌ సినిమాలపై నిషేధంతో బాలీవుడ్ దర్శకనిర్మాతలకు కష్టకాలం మొదలు కాగా పాకిస్థాన్ నటులు కూడా ఇదే విధమైన అనుభవాన్ని ఎదుర్కొంటున్నారు. 1965 యుద్ధం తర్వాత పాక్ అప్పట్లో బాలీవుడ్ చిత్రాలపై విధించిన నిషేధాన్ని 2007లో ఎత్తివేసింది. తాజా ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో మరోమారు బ్యాన్‌ చేసింది. పాకిస్థాన్ లాలీవుడ్(లాహోర్ పేరుతో ఉద్భవించినది) క్రమంగా క్షీణించడంతో పాకిస్థానీలు బాలీవుడ్ సినిమాలపై మోజు పెంచుకున్నారు. సినిమా థియేటర్ల సంఖ్య 30కి పడిపోవడం, ఏడాదికి రెండు సినిమాలకు మించి అక్కడి పరిశ్రమ సినిమాలను విడుదల చేయకపోవడంతో స్వతహాగా హిందీ చిత్రాలను ఇష్టపడే పాకిస్థానీలు బాలీవుడ్ సినిమాలపై మనసు పారేసుకుంటారు. నాలుగు దశాబ్దాల పాటు కొనసాగిన నిషేధాన్ని 2007లో ఉపసంహరించుకోవడంతో పాక్ సినీ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే తాజా పరిస్థితుల నేపథ్యంలో మరోమారు బ్యాన్ తెరపైకి రావడంతో అభిమానులు నిరాశలో కూరుకుపోయారు.

  • Loading...

More Telugu News