: యూరీ దాడిని గట్టిగా ఖండిస్తున్నాను.. పాక్ ఆర్టిస్టులు సమర్థిస్తారని నేను అనుకోను: పాక్ గాయకుడు
ఇటీవల యూరీలోకి పాక్ ఉగ్రవాదులు ప్రవేశించి భారత సైనిక శిబిరాలపై దాడిచేసిన కారణంగా 19 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయిన విషయం విదితమే. ఈ దాడిపై పాకిస్థాన్ గాయకుడు షఫ్కత్ అమానత్ అలీ తాజాగా బహిరంగంగా ఖండించారు. ఇది ఉగ్రవాదుల దాడి అని ఆయన అన్నారు. ఈ ఘటనను తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. పాక్ అర్టిస్టులు యూరీ దాడిపై మాట్లాడకపోవడంపై ఆయన స్పందిస్తూ... తనకు తెలిసినంతవరకు పాక్ నటీనటులు ప్రపంచంలోని ఏ ప్రాంతంలో దాడులు జరిగినా వాటిని ఖండిస్తారని వ్యాఖ్యానించారు. ఉగ్ర దాడులు జరగడమనేది ఏ దేశానికైనా వ్యతిరేకమైనదేనని షఫ్కత్ అమానత్ అలీ పేర్కొన్నారు. చాలా ఏళ్లుగా పాకిస్థాన్ కూడా ఈ కారణంతోనే బాధ పడుతోందని చెప్పారు. పాకిస్థాన్ ఆర్టిస్టులు ఎవ్వరూ యూరీ దాడిని సమర్థించబోరని తాను అనుకుంటున్నట్లు చెప్పారు. తాను పాకిస్థాన్‌లో ఉన్నాను కాబట్టి పాక్ ఆర్మీకి మద్దతు తెలుపుతానని, భారత్‌లో ఉన్నవారు వారి ఆర్మీకి మద్దతు తెలుపుతారని ఆయన వ్యాఖ్యానించారు. సర్జికల్ స్ట్రయిక్స్ ను గురించి అందరూ విన్నారని ఆయన అన్నారు. ఆ దాడులు సరిహద్దు ప్రాంతంలో జరిగాయని అన్నారు. అందువల్ల పరిస్థితులు అదుపులో ఉంటాయని మనకు తెలుసు అని ఆయన వ్యాఖ్యానించారు. భారత సైన్యం జరిపింది సర్జికల్ స్ట్రయిక్సా? లేదా సరిహద్దు ప్రాంతంలో జరిగిన కాల్పులా? అని ఇరు దేశాలు వాదించుకోకూడదని ఆయన అన్నారు. భారత్, పాక్ చర్చలు జరుపుకోవాలని ఆయన అన్నారు.