: బయటపడ్డ ట్రంప్ వీడియో... మహిళలపై దారుణమైన కామెంట్లు
ప్లే బోయ్, బ్యాడ్ బోయ్ ఇమేజ్ లను ఇప్పటికే సొంతం చేసుకున్న రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మరిన్ని చిక్కుల్లో పడ్డారు. అమెరికాను ఏలాలన్న ఆయన ఆశలు ఆవిరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికంతటికీ కారణం ఒక వీడియో. 11 సంవత్సరాల నాటి ఆ వీడియో ట్రంప్ కు ఇప్పుడు శరాఘాతంగా మారింది. మహిళలను ఉద్దేశించి ట్రంప్ అసభ్యంగా మాట్లాడిన మాటలు ఆ వీడియోలో రికార్డ్ అయ్యాయి. "అందమైన మహిళలను ముద్దు పెట్టుకోవాలి. ముద్దు మాత్రమే. ముద్దు కోసం నేను ఎంత మాత్రం వేచి చూడను. స్టార్ స్టేటస్ ఉన్నప్పుడు ఏం చేసినా ఎవరూ ఏమీ అనుకోరు. నిన్ను ముద్దు పెట్టుకోనిస్తారు", ఇలా కొనసాగింది వీడియోలోని సంభాషణ. అంతేకాదు, మహిళల కాళ్లు, వాళ్లతో లైంగిక కార్యకలాపాలు ఇలా ట్రంప్ చేసిన వ్యాఖ్యలన్నీ వీడియోలో రికార్డ్ అయ్యాయి. బిల్లీ బుష్ తో మాట్లాడుతూ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేసినట్టు వీడియోలో ఉంది. ఈ వ్యాఖ్యలపై డెమొక్రాటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ మండిపడ్డారు. 'ఇలాంటి దారుణమైన వ్యక్తిత్వమున్న వ్యక్తిని అధ్యక్షుడిగా మనం అంగీకరించలేం' అని ఆమె వ్యాఖ్యానించారు. తన వ్యాఖ్యలపై ట్రంప్ స్పందిస్తూ... ఇది చాలా సంవత్సరాల క్రితం జరిగిన ఓ ప్రైవేటు సంభాషణ అని... తన మాటలు ఎవరినైనా బాధిస్తే క్షమాపణలు కోరుతున్నానని తెలిపారు. గోల్ఫ్ కోర్స్ లో బిల్ క్లింటన్ తనకంటే దారుణంగా మాట్లాడారని గుర్తు చేశారు. ఏదేమైనప్పటికీ, ఈ వీడియో ట్రంప్ విజయవకాశాలను దెబ్బతీసే అవకాశం ఉందని పరిశీలకులు కూడా అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా మహిళల నుంచి ట్రంప్ కు వ్యతిరేకత ఎదురయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు.