: హిట్లర్ పెద్ద డ్రగ్ బానిస... వెలుగులోకి వచ్చిన సంచలన విషయం
నాజీ నియంత హిట్లర్ గురించిన పలు వాస్తవాలు ఎప్పటికప్పుడు వెలుగుచూస్తూ, చరిత్రకారులను అబ్బురపరుస్తున్న సంగతి తెలిసిందే. నాజీలు రోజుల తరబడి నిద్రాహారాలు మాని యుద్ధం చేశారని, చరిత్రకారులు చెబుతుంటారు. అయితే తాజాగా హిట్లర్ గురించి నార్మన్ ఓలర్ అనే సుప్రసిద్ధ జర్మన్ రచయిత ఓ పుస్తకాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. ఆయన రాసిన ఆ పుస్తకంలో జీవిత చరమాంకంలో హిట్లర్ నరాల వ్యవస్థ పూర్తిగా దెబ్బతిందని తెలిపారు. దానికి కారణం ఆయన హెరాయిన్ వంటి డ్రగ్స్ కు బానిస కావడమేనని పేర్కొన్నారు. అందుకు ఉదాహరణలుగా హిట్లర్ చివరి రోజుల్లో పరధ్యానంలో ఉన్నట్టు ప్రవర్తించేవాడని, అలాగే చాలా తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాడని, దీనికి కారణం డ్రగ్స్ కు బానిస కావడమేనని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయాన్ని హిట్లర్ వ్యక్తిగత ఫిజీషియన్ డాక్టర్ థియో మోరెల్ రాసిన పుస్తకంలో 'హిట్లర్ నరాలన్నీ దాదాపు కుప్ప కూలిపోయాయి. నేను మందులను ఇంజెక్ట్ చేయలేను. ఈవేళ ఇంజెక్షన్ ఇవ్వడం మానేశాను. నిన్న ఏర్పడిన పంక్చర్లు నయమవడానికి శరీరానికి అవకాశం ఇవ్వాలని ఈ రోజు ఇంజెక్షన్ ఇవ్వడం మానేశాను' అని డాక్టర్ థియో మోరెల్ 1944లో ఆయన మరణానికి ముందు పేర్కొన్నట్లు ఆయన తెలిపారు.