: ప్రేమించే భర్త ఉండగా, తప్పుడు ఐడీతో ఫేస్ బుక్ లవ్... ఆపై బెదిరిపోయి ఆత్మహత్య చేసుకున్న ఇల్లాలు!


కోరి కట్టుకున్న భర్త ఉన్నాడు. కాపురం సజావుగా సాగుతోంది. భర్త సంపాదన నిమిత్తం బయటకు వెళ్లే సమయంలో భార్య ఊసుపోక ఫేస్ బుక్ లో ఓ డమ్మీ ఐడీ క్రియేట్ చేసుకుని చేసిన చాటింగ్... చివరికి బలవన్మరణానికి పాల్పడేంత వరకూ తీసుకెళ్లింది. చిత్తూరు జిల్లా మదనపల్లిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, నెల్లూరు జిల్లా కోవూరు ప్రాంతానికి చెందిన పావని రెడ్డి, రెండేళ్ల క్రితం ఎస్కే అహ్మద్ అనే యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరి సంసారంలో సమస్యలు కూడా ఏమీ లేవు. అయితే అహ్మద్ బయటకు వెళ్లిన వేళ, పావని ఫేస్ బుక్ లో చాటింగ్ చేస్తుంటే, మదనపల్లిలోని బజాజ్ షోరూం యజమానిగా సుజిత్ అనే యువకుడు పరిచయం అయ్యాడు. వీరి స్నేహం రోజురోజుకూ పెరిగి ప్రేమగా మారి నగలు, డబ్బు, స్కూటీ వంటి విలువైన బహుమతులను పావనికి అందించింది. ఆపై ఒరిజినల్ ఫోటోలు షేర్ చేసుకోవాలని ఇద్దరూ అనుకున్నారు. ఫోటోలు చూసుకున్న తరువాత పావనికి పెళ్లైపోయిందని తెలుసుకుని షాక్ కు గురైన సుజిత్, ఆమెపై ఖర్చు పెట్టిన రూ. 2 లక్షలనూ ఇవ్వకుంటే రచ్చ చేస్తానని బెదిరించాడు. చంపేస్తానని హెచ్చరించాడు. దీంతో బ్యాంక్ కోచింగ్ కు వెళుతున్నానని చెప్పిన పావని మదనపల్లికి చేరుకుని, తన వద్ద ఉన్న రూ. 15 వేలు తీసుకుని ఈ విషయం గురించి మరచిపోవాలని సుజిత్ ను వేడుకుంది. ఆమె మాటలను లెక్క చేయని సుజిత్, పోలీసులకు ఫిర్యాదు చేస్తానని భయపెట్టాడు. దీంతో భయపడిపోయిన పావని, తన వద్దే వున్న వాస్మోల్ కేశ్ కాలా తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. అంతకుముందు సుజిత్ తో తన సంభాషణ, ఇద్దరి మధ్యా చాటింగ్ కు సంబంధించిన మెసేజ్ లను భర్తకు పంపింది. ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పింది. మదనపల్లిలో మృతదేహం ఉంటుందని కూడా వెల్లడించింది. స్థానికులు పావనిని గమనించి ఆసుపత్రికి తరలించినా ప్రాణాలు మాత్రం మిగల్లేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News